AP CS Vijayanand On Swachh Andhra – Swachh Divas Programme: 'స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్' కార్యక్రమానికి కార్యాచరణను చేపట్టాలని సీఎస్ కె. విజయానంద్ ఆదేశాలు ఇచ్చారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేయాలని ఆయన సూచనలు జారీ చేశారు. దీనిని ప్రతి మూడో శనివారం నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నెలకో థీమ్‌తో 12 మాసాలకు 12 అంశాలతో కూడిన కార్యక్రమ నిర్వహణకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్వచ్ఛత కార్యక్రమాన్ని జనవరి 18న కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని సీఎస్ విజయానంద్ వెల్లడించారు.
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం: దేశంలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ప్రతి శనివారం స్వచ్ఛత కోసం అంకితం కావాలని సీఎస్ విజయానంద్ అన్నారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఇకపై ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. ఈ నెల 18వ తేదీన కడప జిల్లా మైదుకూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ భాగస్వామ్యులు కావాలని అందరికీ పిలుపునిచ్చారు.
అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్: సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించిన సీఎస్ విజయానంద్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు, సలహాలను ఇవ్వాల్సిందిగా అధికారులను కోరారు. స్వచ్ఛత కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు తగిన శ్రద్ద చూపాలన్నారు.