AP CEO Mukesh Kumar Meena Media Conference: రాష్ట్రంలో 29,897 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు సీఈవో తెలిపారు. రాష్ట్రంలో 64 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేయాలని ఆయన అన్నారు. 14 నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్‌కాస్టింగ్ చేయాలని కేంద్ర పరిశీలకులు సిఫార్సు చేశారన్న సీఈవో ఆ సిఫార్సులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పీలేరు, విజయవాడ సెంట్రల్, పలమనేరు, రాయచోటి, తంబళ్లపల్లిలో పూర్తిగా వెబ్‌కాస్టింగ్ చేయాలని మీనా తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్న సీఈవో మీనా ప్రస్తుతానికి 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్టు చెప్పారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఓటర్ల సంఖ్య 1500 దాటితే ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 224 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఉల్లంఘనలకు సంబంధించి 864 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని సీజ్‌లకు సంబంధించి 9 వేలు కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
గుంటూరులో 'లెట్స్ ఓట్'3కె- 82శాతానికి పైగా ఓటింగ్ లక్ష్యం : సీఈవో ముఖేష్ - vote awareness program
సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 16,345 ఫిర్యాదులు వచ్చాయన్నారు. డబ్బు, మద్యం పంపిణీపై 200 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వాటిలో 10,403 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయని తెలిపారు. హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందారని 156 మందికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.