ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బౌన్సర్ల వ్యవస్థ చట్టవిరుద్ధం - దాడి చేస్తే కేసు పెట్టొచ్చు - BOUNCERS ANARCHY IN TELANGANA

వివాదాలకు కారణమవుతున్న బౌన్సర్లు - ప్రభుత్వం దృష్టి సారించాలంటున్న ప్రజలు

Bouncers Anarchy in Telangana
Bouncers Anarchy in Telangana (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2024, 11:46 AM IST

Bouncers Anarchy in Telangana : షాపింగ్​మాల్స్, పబ్బులు, ప్రముఖుల పర్యటనల సందర్భంగా వారు టిప్‌టాప్‌గా కనిపిస్తారు. అడ్డొచ్చిన వారందర్నీ ఈడ్చిపారేయడం, ప్రశ్నిస్తే కొట్టడం, ఇదీ వ్యక్తిగత భద్రత పేరుతో బౌన్సర్లు సాగిస్తున్న అరాచకం. ఈ క్రమంలోనే అసలు బౌన్సర్ల నియామకం, వారి విధులు ఏమున్నాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇటీవల సంధ్య థియేటర్‌ వద్ద పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ వివాహిత మృతి చెందిన విషయం తెలిసిందే. హీరో అల్లు అర్జున్‌కు రక్షణగా వచ్చిన బౌన్సర్లు అభిమానులను తోసేస్తూ చేసిన హడావుడి తొక్కిసలాటకు ఓ కారణమైంది. తాజాగా మంచు కుటుంబం వివాదం నేపథ్యంలో మోహన్‌బాబు, మనోజ్, విష్ణు వర్గాలు పదుల సంఖ్యలో బౌన్సర్లను మోహరించాయి. వారంతా పరస్పరం గొడవకు దిగడం, మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించడం వివాదానికి దారి తీసింది.

సూడో పోలీసులుగా :పోలీసుల తరహాలో బౌన్సర్లు సఫారీ దుస్తులు ధరిస్తుంటారు. కొందరు సూడో పోలీసుల తరహాలో ప్రవర్తిస్తూ దాడికి పాల్పడుతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ ఏజెన్సీలు బౌన్సర్ల పేరుతో నేర చరిత్ర ఉన్నవారిని అడ్డగోలుగా రిక్రూట్​ చేసుకుంటున్నాయి. దేహదారుఢ్యం, ఎత్తు ఉంటే చాలన్నట్లు ఎంపిక చేస్తున్నాయి. హైదరాబాద్‌లో బౌన్సర్లుగా చలామణి అవుతూ సెటిల్‌మెంట్లు చేసేవారు వందల సంఖ్యల్లో ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.ఉచిత ఆహారం, రూ.లక్షల్లో ఆదాయం, వసతి కల్పించడంతో నేరచరిత్ర ఉన్నవారూ వీటిని ఎంచుకుంటున్నారు. కొన్ని ఏజెన్సీలకు పోలీసులతో సంబంధాలు ఉన్నాయి. దీంతో తమకు శ్రమ లేకుండా ప్రముఖులకు భద్రత కల్పిస్తున్నారనే ఉద్దేశంతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.

కేసులూ పెట్టొచ్చు..

  • బౌన్సర్లు దాడి చేస్తే కేసులు నమోదు చేయవచ్చని పోలీసులు పేర్కొన్నారు.
  • బౌన్సర్‌ పేరుతో భద్రతను వాడడానికి వీల్లేదు. ఒకవేళ అలాచేస్తే వారిని ఎంపిక చేసినవారిని, వారి సేవల్ని పొందుతున్నవారి మీద చర్యలు తీసుకోవచ్చు.
  • వీఐపీ భద్రతలో పాల్గొనే వారు వాకీటాకీలు వాడొచ్చు. వీరు మాత్రం సెల్‌ఫోన్లతో వెళ్లిన ప్రాంతాలను చిత్రీకరిస్తుంటారు.
  • యూనిఫామ్‌ మీద కంపెనీ పేరుతో పాటు పీఎస్‌ఎల్‌ఎన్‌ లెసైన్స్ నంబర్, దాని పక్కన రాష్ట్రం కోడ్‌ ఉండాలి.
  • ఈ కోడ్‌ను పస్రా వెబ్‌సైట్​లో తనిఖీ చేస్తే సిబ్బంది వివరాలన్నీ కనిపిస్తాయి.

దాడి చేయడానికి వీల్లేదు : వాస్తవానికి బౌన్సర్ల నియామకం, విధులపై ప్రత్యేక నిబంధనలంటూ ఏమీలేవు. అసలు బౌన్సర్ల వ్యవస్థ చట్టవిరుద్ధం. ది ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీస్‌(రెగ్యులరేషన్‌) చట్టం(పస్రా)- 2005 ప్రకారం వీరిని భద్రతా సిబ్బందిగానే పరిగణలోనికి తీసుకోవాలి. రిజిస్టర్‌ అయిన ఏజెన్సీలు నేరచరిత్ర, వారి ప్రవర్తన ఆధారంగానే భద్రతా సిబ్బందిని ఎంపిక చేయాలి. వీరు ప్రవర్తించాల్సిన తీరు, ఇతర అంశాలపై శిక్షణ ఇవ్వాలి. కేవలం వీరు భద్రత కల్పించడమే తప్ప ఇతరుల మీద దాడికి పాల్పడేందుకు వీల్లేదు. కానీ పబ్బులు, ఈవెంట్ల దగ్గర వీరి ఆగడాలు హద్దు మీరుతున్నాయి.

ప్రభుత్వం దృష్టిసారించాలి : పస్రా చట్టం ప్రకారం ప్రముఖులు అంగరక్షకుల్ని నియమించుకోవచ్చని అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీస్‌(అప్సా) ఛైర్మన్‌ భాస్కర్​రెడ్డి తెలిపారు. వీరి ప్రవర్తనపై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ఇవేవీ లేకుండా బౌన్సర్‌ పేరుతో కొందరు ప్రజల్ని భయపెడుతున్నారని పేర్కొన్నారు. ఇది పెద్ద సమస్యగా మారుతోందన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించాలని భాస్కర్​రెడ్డి కోరారు.

అరాచకాలకు కేరాఫ్​ అడ్రస్​ - గుడివాడ గడ్డం గ్యాంగ్‌

గుంటూరు జిల్లాలో రెచ్చిపోతున్న రౌడీ షీటర్లు - చోద్యం చూస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details