American Consulate Officials Appreciate Millet Artist Talent: విశాఖకు చెందిన మిల్లెట్స్ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ప్రతిభకు అమెరికన్ కాన్సులేట్ అధికార్ల ప్రశంసలు లభించాయి. అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చిత్రాలను మిల్లెట్స్‌తో విజయ్ కుమార్ రూపొందించడం అమెరికన్ అధికార్లను అబ్బుర పరిచింది. మోకా విజయ్ కుమార్ రూపొందించిన ఈ చిత్రపటాలను అమెరికన్ కాన్సులేట్ (హైదరాబాద్) కౌన్సిలర్ ఇన్ఫర్మేషన్ యూనిట్ డిప్యూటీ చీఫ్ జీన్ సోకోలోవ్స్కీ, పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ అలెగ్జాండర్ మెక్లిన్లు ఏయూ అమెరికన్ కార్నర్లో అవిష్కరించారు.
సహజత్వంతో విజయ్ కుమార్ తయారు చేసిన చిత్రాలను చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. విజయ్ కుమార్ గతంలో మిల్లెట్‌తో చేసిన వివిధ చిత్రాలను సైతం ప్రత్యేక ఆల్బంలో అధికార్లు వీక్షించారు. 2023 ఏడాదిని యూఎన్ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. నాటి నుంచి మిల్లెట్స్ ఉపయోగించి వందలాది చిత్రాలను తయారు చేసినట్టు విజయ్ కుమార్ వారికి వివరించారు. ప్రధాని మోదీ మిల్లెట్స్ ప్రాముఖ్యతను వివరించడం నుంచి స్ఫూర్తిని పొంది కళకు ఒక సామాజిక సందేశాన్ని జోడించడమే మిల్లెట్లతో చిత్రాల రూపకల్పనకు ప్రేరణగా విజయ్ కుమార్ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్స్ ప్రాముఖ్యతను చాటిచెప్పే విధంగా వివిధ దేశాధినేతలు, ప్రముఖుల చిత్రాల రూపకల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్టు విజయ్ కుమార్ వెల్లడించారు.