Ambulance Driver Left Heart Patient on Road : గుండెపోటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని తమ పరిధి కాదంటూ హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా అంబులెన్స్ డ్రైవర్ మార్గ మధ్యలోనే దింపేసిన ఘటన ఇది. మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్న ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. కాళేశ్వరం మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన శనిగరం బాపురెడ్డి అనే వ్యక్తికి శనివారం గుండె పోటు వచ్చింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మహదేవపూర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించాలని అక్కడి వైద్యులు సూచించడంతో వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అందుబాటులో లేదని సమాధానం రావడంతో తమకు సమీప బంధువైన మహదేవపూర్ ప్యాక్స్ ఛైర్మన్ చల్ల తిరుపతి కారులో రోగిని ఎక్కించుకుని బయలుదేరారు.
కారులో ఆక్సిజన్ సౌకర్యం లేకపోవడం, బాపురెడ్డి గుండెనొప్పితో తీవ్రంగా బాధపడుతుండటం చూసి చలించిపోయిన కుటుంబసభ్యులు ప్రయాణం చేస్తూనే మరోమారు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. భూపాలపల్లి సమీపంలోకి వచ్చాక 108 వాహనం రావడంతో రోగిని అందులోకి మార్చారు. సిబ్బంది అతడికి ఆక్సిజన్ పెడుతూ కొద్ది దూరం తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాలంటూ బంధువులు డ్రైవర్‌కు సూచించారు. అయితే తమ పరిధి భూపాలపల్లి వరకేనంటూ వారిని జిల్లా పాలనాధికారి సముదాయాల గేటు (నేషనల్ హైవే) వద్ద దింపేసి డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.