Ambati Rambabu lost in Sattenapalli constituency : సంబరాల మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి జనం గుణపాఠం చెప్పారు. మాజీమంత్రి, టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మినారాయణ చేతిలో పరాజయం తప్పలేదు. ప్రతిపనికి పర్సెంటేజిలు, అన్ని వర్గాల వారిని అందినకాడికి దోచుకోవడంతో జనం ఛీకొట్టారు. నోటికి పని చెప్పటం తప్ప చేతల్లో ఎలాంటి పనులు చేయని అంబటి అనవసరమని జనం తీర్మానించారు. అసత్యాల్ని, అర్థసత్యాల్ని అందంగా చెపితే, నాటకీయత జోడిస్తే జనం నమ్మేస్తారనే బ్రమల్ని సత్తెనపల్లి ఓటర్లు పటాపంచలు చేశారు.
గుంటూరు జిల్లాలో కూటమి క్లీన్‌స్వీప్ - భారీ మోజర్టీతో గెలిచిన అభ్యర్థులు
గడ్డం నెరిస్తే రాజకీయాల్లో పెద్దరికం రాదు. చేసే పనులతో వస్తుంది. సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబే దీనికి నిదర్శనం. గుంటూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్‌గా పేరొందిన కన్నా లక్ష్మినారాయణ తన పనులతో పెద్దమనిషిగా నిలబడ్డారు. అంబటి మాత్రం అధికారం, పదవిని అడ్డుపెట్టుకుని తనకు అడ్డులేదని విర్రవీగారు. ఇతర పార్టీల వారిపై నోరేసుకుని పడిపోవటంలో ముందుండే అంబటికి తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే కన్నాకు ఉన్న తేడాను జనం గుర్తించారు. కొన్ని కులాలను రెచ్చగొట్టి కన్నాపైకి ఉసిగొలిపినా, జనసేనతో సఖ్యత దెబ్బతీయాలని చూసినా, టీడీపీ అసంతృప్త నేతల్ని మచ్చిక చేసుకుని కన్నాను ఓడించేందుకు పన్నాగాలు పన్నినా అన్నీ తుస్సుమన్నాయి.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా చాణక్యం ముందు, అంబటి కుప్పిగంతులు పనిచేయలేదు. ప్రజలతో సంబంధాల విషయంలో వారికి మంచి చేసే విషయంలో ఇద్దరికి ఉన్న తేడాని సత్తెనపల్లి ప్రజలు గుర్తించారు. సంక్రాంతి లాటరీ టికెట్ పేరుతో వృద్ధులు, వికలాంగుల పెన్షన్లలో కోత పెట్టిన రాంబాబుకు ఓటర్లు కీలెరిగి వాత పెట్టారు. ప్రమాదంలో బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారంలో వాటా అడిగిన పాపం, ఇలా ఎన్నో పాపాలు పరాజయం రూపంలో పలకరించాయి.