ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబు, నారాయణ పేర్లు చెప్పండి వదిలేస్తాం - చెలరేగిపోయిన సిట్​ - Amaravati Inner Ring Road Scam Case

Amaravati Inner Ring Road Scam Case : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు, నారాయణ తదితరులపై అక్రమ కేసులు పెట్టేందుకు కుయుక్తులు పన్నింది. ఇందులో భాగంగా అసైన్డ్‌ భూములు, ఐఆర్‌ఆర్‌ కేసుల్లో సిట్‌ చెలరేగిపోయింది. వారికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని, విచారణ పేరుతో అధికారుల పట్ల అమానవీయంగా ప్రవర్తించింది. ఈ క్రమంలోనే వారిని బెదిరించి మరీ స్టేట్‌మెంట్లపై సంతకాలు తీసుకున్నారు.

Amaravati Inner Ring Road Scam Case
Amaravati Inner Ring Road Scam Case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 7:39 AM IST

Amaravati IRR Alignment Case Updates : జగన్‌ సర్కార్ అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ తదితరులపై అక్రమ కేసులు బనాయించేందుకు, వారికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా పలువురు ఐఏఎస్‌ అధికారుల్ని బెదిరించింది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, నారాయణ తదితరులు అవినీతికి, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని వారిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చింది.

Amaravati Assigned Land Case : ఆ కేసుల దర్యాప్తు కోసమే ఐపీఎస్‌ అధికారి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల విచారణ పేరుతో అత్యంత అమానవీయంగా వ్యవహరించింది. వారిని అవమానిస్తూ, మానసికంగా కుంగిపోయేలా చేసింది. అప్పట్లో జరిగిన ఘోరాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం రాజధానిలో అక్రమంగా అసైన్డ్‌ భూములు కొన్నారని, వారి ఆస్తులకు విలువ పెరిగేలా రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ను మార్చుకున్నారని పెట్టిన అక్రమ కేసుల్లో చంద్రబాబు, నారాయణలకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని అప్పటి సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను, ఐఆర్‌ఆర్‌పై పనిచేసిన కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగుల్ని సిట్‌ తీవ్రంగా బెదిరించి స్టేట్‌మెంట్లు తీసుకుంది. చంద్రబాబు, నారాయణ పేర్లు చెప్పండి చాలు మిమ్మల్ని వదిలేస్తామని ప్రత్యేక ఆఫర్లూ ఇచ్చింది. వారి పేర్లు చెప్పేందుకు శ్రీధర్‌ అంగీకరించకపోవడంతో, సిట్‌ అధికారులు తామే రాసుకొచ్చిన స్టేట్‌మెంట్లపై ఆయనతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు.

తొలుత దొంగతనం కేసు :అప్పట్లో గుంటూరు జేసీగా భూసమీకరణలో కీలకంగా వ్యవహరించి, తర్వాత సీఆర్డీఏ కమిషనర్‌గా పనిచేసిన శ్రీధర్‌తో చంద్రబాబు, నారాయణలపై తప్పుడు వాంగ్మూలం ఇప్పించడమే లక్ష్యంగా సిట్‌ కుట్రపూరిత ఎత్తుగడలకు పాల్పడింది. ఆయనపై అన్నివైపుల నుంచీ ఒత్తిడి తెచ్చేందుకు మొదట దొంగతనం కేసు బనాయించింది. ఆయన గుంటూరు జేసీగా ఉన్నప్పుడు రాజధాని గ్రామాల రెవెన్యూ రికార్డులను దొంగతనంగా పట్టుకుపోయారని కేసు పెట్టింది.

ఆన్‌లైన్‌లోనే రికార్డులు : వెంకటేశ్వర్లు అనే విశ్రాంత తహసీల్దారుతో శ్రీధర్​కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇప్పించింది. జేసీ కారులో రికార్డులు తీసుకెళ్తుండగా తాను చూశానని కలెక్టరేట్‌లో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగితో చెప్పించింది. తమను బెదిరించి రికార్డులు తీసుకెళ్లారంటూ రాజధాని గ్రామాల్లో పనిచేసే నలుగురైదుగురు వీఆర్‌ఓల్ని బెదిరించి వాంగ్మూలాలు తీసుకుంది. వాస్తవానికి రికార్డులన్నీ ఆయా గ్రామాల్లోనే ఉన్నాయి. ముందుజాగ్రత్తగా వాటి నకళ్లు కలెక్టరేట్‌లో భద్రపరిచారు. పైగా రికార్డులన్నీ ఆన్‌లైన్‌లోనూ ఉన్నాయి.

అయినా అసైన్డ్‌ భూముల వ్యవహారంలో శ్రీధరే రింగ్‌మాస్టర్‌ అని, ఆయన రికార్డులు ఎత్తుకుపోయారని, వాటిలోని అసైన్డ్‌ భూముల వివరాలను చంద్రబాబు, నారాయణలకు చేరవేయడం ద్వారా వారికి లబ్ధి చేకూర్చారని జగన్‌ సర్కార్ తప్పుడు ప్రచారం చేయించింది. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఎలాంటి తప్పూ జరగలేదని వివరించి, ఆయన రికార్డులన్నీ అందజేస్తే, అన్నదాతలకు స్థలాలు కేటాయించేందుకు అనుసరించిన లాటరీ విధానంలో అవకతవకలు జరిగాయని మరో అభియోగాన్ని తెరపైకి తెచ్చింది. లాటరీ విధానం అత్యంత పక్కాగా జరిగిందని, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ప్రశంసించిందని చెబుతూ ఆ సర్టిఫికెట్‌ చూపించినా పట్టించుకోకుండా రోజుల తరబడి వేధించింది.

TDP Leaders On Inner Ring Road Case: వైసీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే... లేని ఇన్నర్ రింగ్‌ రోడ్డుపై కేసులు: టీడీపీ

వారిద్దరి పేర్లు చెబితే వదిలేస్తామంటూ మైండ్‌గేమ్‌ : ఆ అధికారి నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకోవడానికి సిట్‌ మైండ్‌గేమ్‌ అడింది. చంద్రబాబు, నారాయణ అసైన్డ్‌ భూములు కొన్నారని స్టేట్‌మెంట్‌ ఇస్తే మిమ్మల్ని అరెస్ట్‌ చేయబోమని సిట్‌ అధికారులు ఆయనతో ఆఫర్‌ ఇచ్చారు. కొందరు సిట్‌ అధికారులు మంచిగా ఉన్నట్టు నటిస్తూ ‘‘మీ కుటుంబం గురించి ఆలోచించండి. రాజకీయ క్రీడలో మీరెందుకు బలిపశువు అవుతారు? వారిద్దరి పేర్లు చెప్పేస్తే పోతుంది కదా’’ అంటూ ఉచిత సలహాలిచ్చేవారని తెలిసింది. చివరకు చంద్రబాబు, నారాయణ రాజధానిలో అసైన్డ్‌ భూములు కొన్నారంటూ సిట్‌ అధికారులే ఒక స్టేట్‌మెంట్‌ రాసుకొచ్చి సంతకం పెట్టాలన్నారు.

దానికి శ్రీధర్​ నిరాకరించడంతో రెండు రోజుల తర్వాత కనీసం నారాయణపై అయినా స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. చివరకు కొన్ని వీడియోలు, ఫొటోలు చూపించి, నారాయణతో ఉన్నవారు ఎవరని శ్రీధర్‌ను ప్రశ్నించారని, వారు రాజధాని గ్రామానికి చెందిన కొందరు రైతు నాయకులని, ఆయనతో ఉండేవారని శ్రీధర్ చెప్పారని తెలిసింది. దాంతో వారే నారాయణ కోసం అసైన్డ్‌ భూములు కొన్నట్టుగా సిట్‌ అధికారులు తప్పుడు అభియోగాలు మోపినట్టు సమాచారం.

కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగుల్ని ఎత్తుకొచ్చి : రాజధాని ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ నిర్ణయంలో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబు, నారాయణలపై తప్పుడు కేసు బనాయించేందుకు వారికి వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇవ్వాలని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ స్టూప్‌కి చెందిన కొందరు ఉద్యోగుల్ని చెన్నై నుంచి సిట్‌ అధికారులు ఎత్తుకొచ్చారు. వారిని రాజమహేంద్రవరంలో ఉంచి తీవ్రంగా వేధించారు. చివరకు వారు చెప్పినట్టుగా కన్సల్టెన్సీ ఉద్యోగులు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

సీఆర్డీఏలో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగులైన మనోజ్, అరవింద్‌ తమను బెదిరించి, వారు చెప్పినట్టుగా ఓఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ తయారు చేయించారని కన్సల్టెన్సీ సిబ్బందితో సిట్‌ బలవంతంగా చెప్పించింది. మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్‌ ఒత్తిడి మేరకే తాము అలా చేశామని మనోజ్, అరవింద్‌లతో చెప్పించింది. అవన్నీ శ్రీధర్‌ ముందు పెట్టి చంద్రబాబు, నారాయణ, మీరు కుమ్మక్కైపోయారని బెదిరింపులకు గురి చేసింది.

భూముల విలువ పెంచుకునేందుకని తప్పుడు అభియోగాలు :విజయవాడలో నారాయణకు చెందిన భూములు, గుంటూరు జిల్లాలో హెరిటేజ్‌ సంస్థ భూముల విలువ పెంచేందుకు, ఐఆర్‌ఆర్‌ వాటి పక్కనుంచి వెళ్లేలా అలైన్‌మెంట్‌ నిర్ణయించారని సిట్‌ తప్పుడు అభియోగాలు మోపింది. ఐఆర్‌ఆర్‌కు కన్సల్టెన్సీ సంస్థ మూడు ఆప్షన్లు ఇవ్వగా, అప్పటి సర్కార్ ఎంతో కసరత్తు తర్వాత ఒక అలైన్‌మెంట్‌ను ఖరారు చేసిందో శ్రీధర్‌ వారికి వివరించినట్టు తెలిసింది. ఆ అలైన్‌మెంట్‌ ప్రతిపాదనను ప్రజలకు అందుబాటులో ఉంచి, అభ్యంతరాలు స్వీకరించి, వాటన్నిటినీ పరిష్కరించిన విషయాన్నీ ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.

అవి చంద్రబాబు, నారాయణలపై కేసు బిగించేందుకు ఉపయోగపడేలా లేకపోవడంతో సిట్‌ అధికారులు శ్రీధర్​పై మరింత ఒత్తిడి పెంచినట్టు తెలిసింది. చివరకు ఆయన మెయిల్‌ ఐడీ నుంచి మనోజ్‌ అనే సీఆర్డీఏ ఉద్యోగికి ఒక మెయిల్‌ వెళ్లినట్టు, దానిలో పంపిన అలైన్‌మెంట్‌ను ఫాలో అవ్వాలని ఆయన సూచించినట్టు ఒక దొంగ మెయిల్‌ సృష్టించారని తెలుస్తోంది. దాన్ని కమిషనరే పంపినట్టుగా మనోజ్‌ నుంచి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నట్టు తెలిసింది. చివరకు నారాయణతో పాటు రాజధానికి ఎవరెవరు వచ్చేవారన్న వివరాలతో ఒక స్టేట్‌మెంట్‌ తయారుచేసి దానిపై శ్రీధర్‌ సంతకం తీసుకున్నారు.

Arguments in AP High Court on Inner Ring Road: హైకోర్టులో ఇన్నర్​ రింగ్​ రోడ్డు ప్రాజెక్టు వాదనలు.. "ఆ ప్రాజెక్ట్‌ కేవలం కాగితాలకే పరిమితమైంది"

ABOUT THE AUTHOR

...view details