Andhra Pradesh Full Budget :రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టేందుకు కూటమి సర్కార్ సిద్దమైంది. ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై ఉండగా శాసనసభ, ఆర్థిక వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆర్థిక శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు తేదీలు ప్రతిపాదనకు వచ్చాయి. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను సమర్పించింది. మొత్తం రూ.2,86,389 కోట్లకు బడ్జెట్ సమర్పించారు. 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40 గ్రాంట్ల కింద రూ.1,09,052.34 కోట్లకు శాసనసభ ఆమోదం తీసుకున్నారు.
మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ : జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, ఎన్ని అప్పులున్నాయో తెలియని గందరగోళ పరిస్థితుల్లో పూర్తి వివరాలు రాబట్టి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం వెలువరించి పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మరోసారి ఓటాన్ ఎకౌంట్‌కు ఆర్డినెన్సు రూపంలో ఆమోదం తీసుకున్నారు. ఆగస్టు నుంచి నవంబరు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు, ఇతర కార్యకలాపాల కోసం రూ.1,29,972.97 కోట్లతో 40 గ్రాంట్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్‌కు గవర్నర్ నుంచి ఆమోదం తీసుకున్నారు. ఇలా మొత్తం 8 నెలల కాలం ఓట్ ఆన్ అకౌంట్ పద్దుతోనే గడిచిపోయింది. ఈ నేపథ్యంలో నవంబరు రెండో వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదం తీసుకోవాల్సి ఉంది.
పూర్తిస్థాయి బడ్జెట్‌పై సర్కార్ కసరత్తు - శాఖల వారీగా సమీక్షలు - AP Govt Exercise on Budget 2024
సంక్షేమానికి అదనపు కేటాయింపులు! :ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు భారీగా సంక్షేమ పథకాల అమలుకు హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే వృద్ధాప్య, ఇతర పెన్షన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తున్నారు. మిగిలిన సంక్షేమ పథకాల అమలుపై ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాల వ్యయం కన్నా మరో రూ.20 వేల కోట్ల వరకు అదనంగా ఖర్చవుతుందని అధికారులు లెక్క తేల్చినట్లు సమాచారం. నవంబరు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ కూడా అమలు కాబోతోంది. రాబోయే నాలుగు నెలల్లో ఏ పథకం ఎలా అమలు చేయబోతున్నారో బడ్జెట్‌లో రూపురేఖలు వెల్లడిస్తారు. ఆయా పథకాల విధివిధానాలు, లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా అంచనా వ్యయాలు రూపొందించారు. ప్రస్తుతం నిరుద్యోగభృతికి ఎంత వ్యయమవుతుందో అంచనాలు రూపొందించినా భవిష్యత్తులో ఉపాధి కల్పన మేరకు ఈ భారం తగ్గుతుందనే అంచనాలో ఉన్నారు. సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆర్థికశాఖ అధికారులు సూచనప్రాయంగా వెల్లడిస్తున్నారు.
రూ.2.90 లక్షల కోట్లతో పూర్తి స్థాయి పద్దు! :వాస్తవానికి చివరి నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ఖర్చులకు ఆమోదం తీసుకోవాల్సి ఉన్నా ఏడాది మొత్తానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిందే. దాదాపు రూ.2.90 లక్షల కోట్ల మేరకు బడ్జెట్ ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులు కీలకం కానున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా కూడా వివిధ పథకాలకు బడ్జెట్‌లో నిధులు చూపబోతున్నారు. కేంద్ర పథకాలకు, రాష్ట్ర వాటా నిధులు సమకూరుస్తూ దాదాపు 28 పథకాల కింద పనులు చేయబోతున్నారు. ప్రస్తుతం ఆర్థికశాఖ కార్యదర్శి ఆయా ప్రభుత్వ శాఖలతో ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చిస్తున్నారు. తదుపరి దశలో మంత్రుల స్థాయి సమావేశాలు ఉంటాయని సమాచారం.
బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం ఫోకస్ - ఓటాన్ అకౌంట్ లేదా పూర్తి స్థాయి పద్దుపై తర్జన భర్జన - AP Govt Budget 2024
'అలా చేస్తే ఖజానా నుంచి డబ్బు డ్రా చేయలేరు'- బడ్జెట్‌పై కొత్త ప్రభుత్వానికి యనమల సూచన - Yanamala on AP Budget 2024