Alliance Candidates Election Campaign in AP : పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కూటమి అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కూటమి అభ్యర్థులకు ప్రజలకు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి.
పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం :శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో కూటమి పార్లమెంటు అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ ప్రచారం చేశారు. గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఈశ్వరరావు లావేరు మండలంలోని గ్రామాల్లో ప్రచారం చేశారు. అక్కడి ప్రజలు ఆయనపై పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతించారు. తర్వాత గ్రామంలో రోడ్‌షో నిర్వహించి స్థానికులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
వాలీబాల్ ఆడి కార్యకర్తలను ఉత్సాహపరిచిన నేతలు :అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా సి.ఎం. రమేష్‌ను గెలిపించాలని కోరుతూ ఆయన కుటుంబసభ్యులు అనకాపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం రమేష్ సతీమణి, ఆయన సోదరి నియోజకవర్గంలోని కాలనీలు, మత్స్యకార గ్రామాల్లో తిరిగారు. కరపత్రాలు పంచుతూ సీఎం రమేష్‌ను గెలిపించాలని కోరారు. తమ ప్రచారంలో ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని సీఎం రమేష్ కుటుంబసభ్యులు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కూటమి అభ్యర్థి అయ్యన్నపాత్రుడు మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. క్రీడా మైదానంలోకి వెళ్లి వాకర్స్‌తో మాట్లాడారు. వాలీబాల్ ఆడి నాయకులు, కార్యకర్తలను అయ్యన్నపాత్రుడు ఉత్సాహపరిచారు.
కూటమితో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం :తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం, భాజపా, జనసేన నేతలతో కలిసి ప్రధాన రహదారిపైన ఉన్న దుకాణాలు, వాహదారులతో మాట్లాడారు. కమలం గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు మార్టూరులో ప్రచారం చేశారు. అక్కడి ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు, మహిళలు పూలు చల్లుతూ ఏలూరి సాంబశివరావును ఆహ్వానించారు.
కూటమి నేతలకు బ్రహ్మరథం :తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన పత్రాలను చేతపట్టి వృద్ధులు ప్రచారంలో పాల్గొన్నారు. ఏలూరి సాంబశివరావు ప్రచారంతో పర్చూరులోని వీధులు అభిమానులతో నిండిపోయాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని 26 వ వార్డులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటింటికి ప్రచారం చేశారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు, కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. కూటమితో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని జయనాగేశ్వరరెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి గ్రామాల్లో ప్రచారం నిర్వహిచారు. స్థానికులు అయనకు బ్రహ్మరథం పట్టారు. పసుపు జెండాలు చేతపట్టి స్వాగతం పలికారు. గజమాలతో ఆహ్వానించారు. తర్వాత రోడ్‌షో నిర్వహించి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు.