All parties Election Campaign in Andhra Pradesh : ఎన్నికలు దగ్గరపడటంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూటమి నేతలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అరాచకాలను ఎండగడుతూ జగన్ పాలనలో జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. కూటమి ప్రకటింటిన మేనిఫెస్టోని అభ్యర్థులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
కూటమి గెలవటం ఖాయం : అనంతపురం జిల్లా పెనుకొండ కూటమి అభ్యర్థి సవిత నియోజకవర్గంలో విస్త్రతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాలు తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కూటమి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. మహిళలు, వృద్ధులతో మాట్లాడి తెలుగుదేశం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్ ముదిగుబ్బ మండలంలో ప్రచారం నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకుని గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కూటమి గెలవటం ఖాయమని ఎమ్మెల్యే అభ్యర్థి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ప్రచారం చేశారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గౌరు చరిత ఓర్వకల్లు మండలంలొ ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో సమస్యలు అడిగి తెలుసుకుని కూటమిని గెలిపించాలని కోరారు.
కూటమితోనే రామరాజ్యం : ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ప్రజల ఆస్తులు కాజేసే ప్రమాదం ఉందని గుంటూరు లోక్‌సభ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో ఆయన ప్రచారం నిర్వహించి రైతులు, మహిళలతో మాట్లాడారు. రామరాజ్యం కావాలంటే కూటమిని గెలిపించాలని బాపట్ల జిల్లా పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలోని యద్దనపూడిలో ప్రచారం నిర్వహించి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించారు.
కూటమి గెలుపుతోనే రాష్ట్ర భవిష్యత్తు : కృష్ణాజిల్లా పెనమలూరులో కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌తో కలిసి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ప్రచారం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే కూటమిని గెలిపించాలని రామకృష్ణ కోరారు. విజయవాడ తూర్పు నియోజక వర్గంలోని 9వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ సతీమణి గద్దె అనురాధ, కుమారుడు క్రాంతి కుమార్ ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్‌ను, ఎంపీగా కేశినేని శివనాథ్‌ను గెలిపించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలంలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే జనం కష్టాలు తీరుతాయని సౌమ్య భరోసానిచ్చారు.