Air Pollution Increase In Hyderabad: హైదరాబాద్ నగరంలో వాయునాణ్యత క్రమంగా పడిపోతోంది. దీపావళి టపాసుల కాలుష్యానికి, పొగ మంచు తోడవడంతో 10 రోజులుగా అనేకచోట్ల వాయు నాణ్యత సూచీ 100కి పైగా నమోదు కాగా, కాప్రాలో అత్యధికంగా 214గా నమోదైంది. సీపీసీబీ నిర్దేశిత పరిమితుల ప్రకారం వాయునాణ్యత సూచీ సున్నా నుంచి 100 మధ్య నమోదైతే అంతా బాగా ఉన్నట్లు. 101 నుంచి 200 మధ్య నమోదయ్యే చోట దీర్ఘకాలంలో ఆస్తమా, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉండే వారికి ఇబ్బందులు వస్తాయి. 201 నుంచి 300 మధ్య నమోదైతే ఆరోగ్యవంతులకు దీర్ఘకాలంలో శ్వాసపరమైన ఇబ్బందులు వస్తాయి.
సీపీసీబీ సమీర్‌యాప్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం
- నవంబరు 2న ఈసీఐఎల్ కాప్రాలో వాయునాణ్యత సూచీ 214గా నమోదు అయింది. పది రోజుల్లోనే 151 నుంచి 214 నమోదవడం గమనార్హం. ఇక్కడ పీఎం 10 స్థాయిలు అధికంగా ఉన్నాయని వెల్లడించింది.
- కోకాపేటలో నిర్మాణ కార్యకలాపాలు అధికంగా ఉండడంతో ఎక్కువగా కాలుష్యం నమోదవుతోంది. పీఎం 10 సూక్ష్మ ధూళి కణాల స్థాయి పెరుగుతోంది. నవంబరు మొదటి వారం నుంచి వాయు నాణ్యత 100కి పైగా నమోదవుతుంది. ఈ నెల 1 నుంచి 10 వరకు ఇక్కడ 102 నుంచి 153 మధ్య వాయునాణ్యత సూచీ నమోదవుతుంది.
- జూపార్కు ప్రాంతంలోనూ పీఎం 10 సూక్ష్మధూళి కణాలస్థాయి పెరిగిపోతుంది. నవంబరు 1న ఇక్కడ వాయునాణ్యత సూచీ 150గా నమోదైంది. అనంతరం వరసగా 131-142గా నమోదైంది.
- న్యూమలక్‌పేట్, కొంపల్లి, నాచారంలో నవంబరు 1న సూచీ 120 -186 మధ్య నమోదవగా మిగిలిన రోజుల్లో సంతృప్తికర స్థాయిలో ఉన్నట్లు సీపీసీబీ వెల్లడించింది.
- సనత్‌నగర్‌లో వాయునాణ్యత పడిపోతోంది. మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఘాటు వాసనలపై నిఘా : పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలతో హైదరాబాద్‌వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో వీటి కట్టడికి పీసీబీ కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్‌లోని పరిశ్రమలపై నిఘా పెట్టేందుకు ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్, అనలిస్ట్‌తో కూడిన ఐదు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు నిత్యం పారిశ్రామిక వాడల్లో కార్యకలాపాలను పరిశీలిస్తాయి.