Actor Prasad Behara Arrested in Hyderabad :''పెళ్లివారమండి'' వెబ్ సిరీస్ ఫేమ్ నటుడు, దర్శకుడు ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారు. సహచర నటిని వేధించిన కేసులో బెహరా జూబ్లీహిల్స్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. మణికొండకు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓ వెబ్‌సిరీస్ షూటింగ్ సమయంలో ప్రసాద్ తనకు పరిచయమయ్యాడని యువతి తెలిపింది. షూట్‌లో భాగంగా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని వివరించింది. ఇదేంటని నిలదీయడంతో క్షమాపణలు చెప్పాడని పేర్కొంది.
కొద్ది రోజుల తర్వాత మరో వెబ్ సిరీస్‌లోనూ తాము కలిసి పని చేశామని, ఆ సమయంలో అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించాడని యువతి తెలిపింది. ఇదేమిటని ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించాడని వాపోయింది. ఈ నెల 11న షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్ అందరి ముందు తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్‌ను కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.