Accident in Quarry Several Dead:ఎన్టీఆర్జిల్లా కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో విషాదం చోటుచేసుకుంది. క్వారీలో లూజు బోల్డర్స్ జారి డ్రిల్ చేస్తున్న కార్మికులపై పడ్డాయి. దీంతో బోల్డర్స్, పెద్ద పెద్ద బండరాళ్ల కింద చిక్కుకుని ముగ్గురు కార్మికులు మృతిచెందారు. రాళ్ల కింద చిక్కుకున్న మరో కార్మికుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులు జి.కొండూరు మండలం చెరువు మాధవవరానికి చెందిన దుర్గారావుతోపాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాందేవ్, ఒడిశాకు చెందిన బీబీ నాయక్‌గా గుర్తించారు. ఉదయాన్నే పనికి వెళ్లినవారు విగతజీవులుగా మారడంతో మృతుల కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.
క్వారీ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాల్ని ఆదుకోవాలని బాధితులు, సహచర సిబ్బంది, చెరువు మాధవవరం గ్రామస్థులు కోరుతున్నారు. సహాయక సిబ్బంది కొండ శకలాలను తొలగించి మొదట ఒక మృతదేహాన్ని వెలికితీశారు. వర్షం కురుస్తుండటంతో మరో రెండు మృతదేహాలను తీసేందుకు ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ పోలీసు, రెవెన్యూ అధికారులు వర్షంలోనే సహాయ కార్యక్రమాలు కొనసాగించి మిగిలిన మృతదేహాల్ని బయటకు తీశారు.