Aadhar Reunites Parents to Missing Boy : ఆ బాలుడు చిన్నతనంలో ముంబయిలో తప్పిపోయాడు. అక్కడి నుంచి రైలు ఎక్కి ఏపీకి చేరుకున్నాడు. అలా రోడ్లపై తిరుగుతున్న ఆ చిన్నారిని జువైనల్ హోంకు తరలించారు. అక్కడే బాలుడు పెరిగాడు. అధికారులు అతని పేర ఆధార్ కార్డు నమోదు చేయించాలని అనుకున్నారు. నమోదు కేంద్రం వద్దకు తీసుకువెళ్తే అప్పటికే ఆధార్ కార్డు ఉందని సిబ్బంది చెప్పారు. వెంటనే అధికారులు అందులోని చిరునామాను సంప్రదించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముంబయికి చెందిన దుర్గాదాస్, లక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరి రెండో కుమారుడు అథర్వ 2017లో ఏడేళ్ల వయస్సులో తప్పిపోయాడు. వారు అప్పట్లో ముంబయి పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేయగా, పోలీసులు అదృశ్య కేసు నమోదు చేశారు. అలా అథర్వ రైలు ఎక్కి కర్నూలుకు చేరుకున్నాడు. అక్కడ రోడ్లపై తిరుగుతుంటే బాలల సంక్షేమ సమితి వారు కర్నూలు జువెనైల్ హోంకు తీసుకెళ్లారు.
A Boy Meets Parents After 7 Years :ఆ బాలుడిని 2022లో కడప ప్రభుత్వ బాలుర గృహానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం 14 ఏళ్ల వయస్సు ఉన్న అథర్వ ఏడో తరగతి చదువుతున్నాడు. అతనికి ఆధార్ కార్డు నమోదు చేయించాలని తీసుకెళ్లగా అతడి పేరుతో అప్పటికే కార్డు జారీ అయిందని వచ్చింది. వెంటనే అధికారులు ఆ వివరాలు, చిరునామా తెలుసుకుని, ముంబయిలోని ప్రభుత్వ బాలుర గృహం వారికి పంపించారు. వారు అథర్వ తల్లిదండ్రులకు తెలిపారు. తమ కొడుకు ఆచూకీ తెలియడంతో వెంటనే ముంబయి నుంచి కడప వచ్చారు.