A Team of judges will go to Kurnool Due to High Court Bench :కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంచ్‌కు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6న హైకోర్టు జడ్జిల బృందం కర్నూలుకు వెళ్లనుంది. దిన్నెదేవరపాడు వద్ద విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు చెందిన భవనాన్ని వారు పరిశీలించనున్నట్లు రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ తెలిపారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. బెంచ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.
కలెక్టర్‌కు హైకోర్టు రిజిస్ట్రార్ లేఖ : అయితే కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం 15 మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ గత నెల జనవరి 29న కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస, వసతి సౌకర్యాల పూర్తి సమాచారాన్ని జనవరి 30లోపు తమ ముందు ఉంచాలని, ఈ వ్యవహారాన్ని అత్యవసరంగా భావించాలని కలెక్టర్‌కు రాసిన లేఖలో రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
అక్కడ సౌకర్యాలు ఉన్నాయా ?లేవా? : ఈ వివరాలను హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ముందు ఉంచాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఈ లేఖపై వెంటనే స్పందించిన కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా రహదారులు, భవనాలశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఆర్డీవోలకు లేఖ రాశారు. హైకోర్టు కోరిన సౌకర్యాలతో ప్రభుత్వ/ప్రైవేటు భవనాలు ఉన్నాయా ?లేవా? అనే విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించి ఈ నెల 30లోపు నివేదిక ఇవ్వాలని కర్నూలు ఆర్డీవోకు స్పష్టం చేశారు.