Cows Theft in Talamarla :కనిపెంచిన బిడ్డలు దూరం అవుతారేమో గాని, తమతో కష్టం పంచుకునే పశువులను మాత్రం రైతులు దూరం చేసుకోరంటే అతిశయోక్తి కాదు. వాటిని తమ సొంత కన్నబిడ్డలుగా ఆలనా పాలన చూసుకుంటారు. వాటికి ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తితే యజమానులు అల్లాడిపోతారు. అలాంటి పశువులు కనిపించకుండా పోతే వారి గుండె పగిలిపోతుంది. అవి ఎక్కడికి పోయాయని కంగారు పడుతుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
ఆ రైతు ఉదయాన్నే లేచేసరికి రోజు పాలిచ్చే ఆవులను దుండగులు చోరీ చేశారు. దీంతో కన్నీటిపర్యంతమైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయని పోలీసులు వాటిని ఎవరు దొంగతనం చేశారో గుర్తించాలని సలహా ఇచ్చారు. పరిస్థితిని అర్ధం చేసుకున్న ఆ రైతు తానే ఓ పోలీస్‌గా అవతారం ఎత్తాడు. ఐదు రోజుల పాటు గాలించి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఆవులను తిరిగి ఇంటికి తెచ్చుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే కొత్తచెరువు మండలం తలమర్లకు చెందిన ఫణీంద్రరెడ్డికి వ్యవసాయంతోపాటు పాడిపోషణే జీవనాధారం. రెండు పాడి ఆవులతో నెలకు రూ.20,000ల ఆదాయం సమకూరుతోంది. ఐదు రోజుల కిందట ఎప్పటిలాగే ఇండ్లవెంకటాంపల్లి దారిలోని పొలంలో ఉన్న షెడ్డులో ఆవులకు మేతవేసి ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆయన పాలు పితకడానికి వెళ్లగా షెడ్డులో రెండు ఆవులు, దూడ కనిపించలేదు. చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆందోళన చెందిన ఫణీంద్రరెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయని పోలీసులు ఆవులు ఎవరు చోరీ చేశారో గుర్తించాలని సలహా ఇచ్చారు.