Student Murder in Guntur District : తొమ్మిదో తరగతి చదివే ఓ అనాథ బాలుడు అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలాడు. అయినా ఆ గ్రామస్థుల్లో మానవత్వం కనిపించలేదు. పోలీసులకు విషయం తెలిసినా పట్టించుకోలేదు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుది. తాడికొండ మండలం పొన్నేకల్లులో గత నెల 24న జరిగిన ఈ ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మృతుడు షేక్ సమీర్ స్వగ్రామం గుంటూరు జిల్లా అమరావతి మండలం కర్లపూడి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో పొన్నేకల్లులోని నాయనమ్మ మస్తాన్‌బీ వద్ద ఉంటున్నాడు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి (బీ సెక్షన్) చదువుతున్నాడు. ఆ తరగతికే చెందిన ఏ సెక్షన్ విద్యార్థులు పది మంది కొద్ది రోజులుగా ఆ బాలుడితో గొడవపడి కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో అక్టోబర్ 24న షేక్ సమీర్ పాఠశాలకు వెళ్లలేదు. ఆ రోజు మధ్యాహ్నం పాఠశాలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆ సమయంలో తొమ్మిదో తరగతి పిల్లలు కొందరు డ్రిల్ చేయకుండా వెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే సహచర విద్యార్థులు ఇంటివద్ద ఉన్న సమీర్‌ను తీసుకొని ఈత కొడదామని గ్రామ పొలిమేరలోని బావి వద్దకెళ్లి అతనిపై దాడి చేసి అందులో పడేసినట్లు తెలుస్తోంది. సాయంత్రానికి గ్రామస్థులు, కొందరు ఉపాధ్యాయుల దృష్టికి సమీర్ చనిపోయినట్లు సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకుని బావిలో ఉన్న బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి శరీరంపై రక్త గాయాలు, చొక్కాపై రక్తపు మరకలు ఉండటాన్ని గమనించారు.