5 KG GOLD THEFT CASE: గుంటూరు జిల్లా మంగళగిరిలో 5 కిలోల బంగారం అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. విజయవాడలోని బంగారు దుకాణం నుంచి మంగళగిరి మండలం ఆత్మకూరు జాతీయ రహదారి వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజిని క్షుణ్ణంగా పరిశీలించారు. విజయవాడ నుంచి ఆత్మకూరు వరకు దొంగతనం జరిగిన తీరును పోలీసులు ఆదివారం రీ క్రియేట్ చేశారు.
విజయవాడ బంగారు దుకాణం నుంచి బాధితుడు నాగరాజు ఆభరణాలు తీసుకెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అతన్ని వెంబడించినట్లు గుర్తించారు. పల్సర్ బైక్పై నాగరాజును అనుసరిస్తున్న దృశ్యాలను విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సేకరించారు. ముగ్గురు అనుమానితులు ఎవరు? ఎక్కడినుంచి వచ్చారు? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరో రెండు రోజుల్లో కేసిన ఛేదిస్తామని పోలీసులు వెల్లడించారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?:ఆత్మకూరు జాతీయ రహదారి జంక్షన్ వద్ద బంగారం చోరీ ఘటన శనివారం కలకలం రేపింది. ఈ ప్రాంతం అత్యంత రద్దీగా ఉంటుంది. ఇటువంటి ప్రాంతంలో దొంగతనం జరగడంపై తొలుత పోలీసులు అనుమానం చేశారు. బైక్పై 5 కిలోల బంగారు ఆభరణాలను తీసుకెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బ్యాగ్ లాక్కుని పారిపోయారని బాధితుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.