41th Day of Anganwadi Workers Strike in AP :ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరితే మహిళలు అని చూడకుండా రోడ్డు పాలు చేశారని అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనం, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 41వ రోజు అంగన్వాడీలు కదం తొక్కారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 41వ రోజూ ఆందోళనలు కొనసాగించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద మోకాళ్లపై కూర్చొని దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల అరెస్టును ఖండించారు. వెంటనే జీతాలు పెంచాలని, అక్రమ అరెస్టులను ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.
డిమాండ్ల సాధన కోసం విశ్రమించని అంగన్వాడీలు - మొద్దు నిద్రను నటిస్తున్న ప్రభుత్వం
బాపట్ల జిల్లాలో అంగన్వాడీలు చేస్తున్న నిరసనలు కోనసాగుతునే ఉన్నాయి. జిల్లాలోని కారంచేడులో మోకాళ్లపై కూర్చోని దండం పెడుతూ సమస్యల పరిష్కరించాలని అంగన్వాడీలు ఆందోళనలు చేశారు. "జగనన్న సామ్రాజ్యంలో తమకి ఈ కర్మ ఏందంటూ" పాటలు పాడుతూ, బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. తమని ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపితే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంటికి పంపుతారని అంగన్వాడీలు హెచ్చరించారు.
Anganwadi Workers Strike Across State : పర్చూరి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అంగన్వాడీలు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం జగన్ అరాచక పాలనకు అంగన్వాడీల ఇబ్బందులే నిదర్శనమని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టూ కూడా లేదంకు విమర్శించారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగించి అంగన్వాడీలను విధుల నుంచి తొలగిస్థామని అనడం దారుణమని తెలిపారు. అంగన్వాడీలకు తెలుగు దేశం పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.