Climate Trends Report on Weather in 2024 Year : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024వ సంవత్సరం చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్ నెలలో ముందస్తు రుతుపవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తరవాత ఐదో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని ఈ సంస్థ వెల్లడించింది.
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో 2023 జూన్ నుంచి 10 నెలలుగా ప్రతినెలా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని తెలిపింది. కానీ ఏప్రిల్ మాసం అత్యంత వేడి నెలగా రికార్డులకు ఎక్కిందని చెప్పింది. అలాగే భారత్‌లో జరుగుతున్న అభ్యర్థుల ప్రచారం, ఓటింగ్‌పై వాతావరణ మార్పుల ప్రభావం ఉందంది. అందుకే మరోసారి దేశంలో ఎన్నికలు నిర్వహించేందుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు అనుకూలిస్తాయా?అనే అంశంపై ఒక నివేదిక విడుదల చేసింది.
- ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా 90 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేసేందుకు సంసిద్ధమయ్యారు.
- సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు 4-8 రోజులు వడగాలులు ఉంటాయి. ఈసారి అది 10 నుంచి 20 రోజులకు పెరిగింది. ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కేరళలో ఓటు వేసేందుకు వరుసల్లో నిల్చోవడంతో పది మంది ఎండదెబ్బకు మరణించారు. కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం ఏప్రిల్ 22 నాటికి 413 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ఒడిశాలో అయితే 124 కేసులు నమోదైతే ఒక మరణం సంభవించింది.
- భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం భారత ద్వీకల్పం మీదుగా యాంటీ సైక్లోన్ల వాతావరణం కారణంగా దేశంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడటం లేదు. దీంతో ఒడిశా, పశ్చిమబెంగాల్ నుంచి సముద్రగాలులు తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
- దేశవ్యాప్తంగా ఇప్పటికే 20 శాతం ముందస్తు రుతుపవనాల వర్షపాతం లోటు నమోదైంది. మానవ తప్పిదాల కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులతో ఎల్‌నినో మరింత బలంగా మారుతోంది. గతంలో ఎల్‌నినో కారణంగా 2016 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. 2023లో సూపర్ ఎల్‌నినో కారణంగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
- దేశంలోని కోస్తా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు దాటితే అత్యంత ప్రమాదంగా భావిస్తాం. ఈ తరహా ఉష్ణోగ్రతలు తీర ప్రాంతాలతో పాటు దేశంలోని అన్ని చోట్ల నమోదయ్యాయి. ఈ విషయంలో భారత తూర్పు తీర ప్రాంతం అత్యంత ప్రభావమైంది.
- భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం భారత ద్వీకల్పం మీదుగా యాంటీ సైక్లోన్ల వాతావరణం కారణంగా దేశంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడటం లేదు. దీంతో ఒడిశా, పశ్చిమబెంగాల్ నుంచి సముద్ర గాలులు తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
- అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థ వెల్లడించిన ప్రకారం ఎన్నికలు ప్రారంభమైన తరవాత ఏప్రిల్‌లో భారత్‌లోని 51 ప్రధాన నగరాలకుగాను 36 నగరాల్లో వరుసగా 3 అంతకన్నా ఎక్కువ రోజులు 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో 3 రోజుల కన్నా ఎక్కువగా 18 నగరాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.