తెలంగాణ

telangana

ఎంత సంపాదించినా డబ్బులు మిగలట్లేదా? శ్రీచక్రం ఇంట్లో ప్రతిష్ఠిస్తే మీకు బ్రేకులుండవు! - Benefits Of Sri Chakra In Telugu

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 7:01 PM IST

Benefits Of Sri Chakra In Telugu : ఎవరైనా కష్టపడి పని చేసేది డబ్బు కోసమే! తీరా అంత కష్టపడిన తర్వాత కూడా వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోతుంటే, రూపాయి కూడా మిగలకపోతే చాలా బాధగా ఉంటుంది. లోపం ఎక్కడుందో అర్థం కాక తలలు పట్టుకునే వారు ఒక్కసారి ఈ కథనం పూర్తిగా చదివి ఇందులో సూచించిన పరిహారాలు పాటిస్తే వచ్చే ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు!

Benefits Of Sri Chakra In Telugu
Benefits Of Sri Chakra In Telugu (GettyImages)

Benefits Of Sri Chakra In Telugu : ధనం సంపాదించడానికి కొంతమంది రాత్రనక పగలనక కష్ట పడుతూ ఉంటారు. మరికొందరికి మాత్రం సునాయాసంగా డబ్బు వచ్చేస్తుంది. దీనికి కారణమేమై ఉంటుందో అని ఆలోచిస్తున్నారా! జ్యోతిష శాస్త్రం ప్రకారం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే కేవలం శ్రమ ఒక్కటే సరిపోదు. కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని పరిహారాలు చేయాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అవేంటో తెలుసుకుందాం.

శ్రీచక్ర ప్రతిష్ఠ
ఇల్లు సిరిసంపదలతో నిండి, ఎప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఇంట్లో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించుకోవాలని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. శ్రీచక్రం చాలా శక్తిమంతమైనది. అందుకే ఇంట్లో శ్రీ చక్రం ప్రతిష్ఠించుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.

శ్రీచక్రం ప్రతిష్ఠకు నియమాలు

  • ముందుగా శ్రీచక్రాన్ని ఎర్రటి పట్టు వస్త్రంలో ఉంచి పంచామృతాలతో అభిషేకించాలి.
  • పసుపు, కుంకుమలతో, అక్షింతలతో శ్రీచక్రాన్ని పూజించాలి.
  • ఎర్రటి పువ్వులను 108 తీసుకుని శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుతూ ఒక్కో పువ్వు వేస్తూ లక్ష్మీదేవిని శాస్త్రోక్తంగా పూజించాలి.
  • కనీసం 10 నిమిషాలపాటు కళ్లు మూసుకుని లక్ష్మీదేవిని మనసులో స్థిరంగా నిలుపుకుని ధ్యానం చేయాలి.
  • ధ్యానం చేసే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలు, ప్రాపంచిక విషయాలు మనసులోకి రాకుండా నియంత్రించుకోవాలి.
  • మీ కోరికలు, సమస్యలు ఆర్థిక ఇబ్బందుల గురించి శ్రీమహాలక్ష్మికి తెలియజేయండి.
  • ధ్యానం పూర్తయ్యాక ధూప దీపాలతో శ్రీచక్రాన్ని పూజించి నమస్కరించుకోవాలి.
  • పూజ సంపూర్ణం అయ్యాక లక్ష్మీదేవికి ఇష్టమైన పరమాన్నం నివేదించాలి.
  • చివరగా కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి.
  • ఇప్పుడు శ్రీచక్రాన్ని ఎర్రటి వస్త్రంతో సహా ఇంటి సింహద్వారం పైన కట్టుకోవాలి.
  • రోజూ శ్రీచక్రానికి సాంబ్రాణి ధూపం వేసి నమస్కరించుకోవాలి.

విజయ సిద్ధి! లక్ష్మీ కటాక్షం
ఇలా శ్రీ చక్రాన్ని ఇంట్లో ప్రతిష్టించుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లోని వారు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సిరుల తల్లి అనుగ్రహంతో ఆ ఇంట ఎన్నటికీ ధనానికి లోటుండదు. ధన కనక వర్షం కురుస్తుంది.

వ్యాపార స్థలంలో కూడా
ఇవే నియమాలతో వ్యాపార స్థలంలో కూడా శ్రీచక్రాన్ని ప్రతిష్టించుకోవచ్చు. శ్రీ చక్రం ప్రతిష్ఠ జరిగిన చోట నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. రుణ విముక్తి లభిస్తుంది.

ఈ నియమాలు తప్పనిసరి
శ్రీచక్రం ప్రతిష్ఠ చేసే సమయంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఈశాన్యంలో ఉత్తర దిక్కులో ఈ ప్రతిష్ఠ చేయాలి. చిరిగిన లేక మాసిన వస్తంలో శ్రీచక్రాన్ని ఉంచరాదు. ఇలా చేస్తే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చిన రోజు శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తే శుభ ఫలితాలు శీఘ్రంగా అందుకుంటారు. మైల, అంటు వంటి వాటికి శ్రీచక్రాన్ని దూరంగా ఉంచాలి.

ఇల్లయినా వ్యాపారమైనా ఈ నియమాలు పాటిస్తూ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠిస్తే తప్పకుండా అష్టైశ్వర్యాలు కలగడం సహా ఆ ఇంట శాంతి సౌఖ్యాలు కూడా నెలకొంటాయి. శుభం భూయాత్.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

ABOUT THE AUTHOR

...view details