YSRCP RAJYA SABHA MPs: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా జగన్ తీరులో మార్పు రాకపోవడం, నేతలు, నాయకుల్ని పట్టించుకోకపోవటం, పార్టీ నేతలపై వరుస వివాదాలు వస్తున్నా దిద్దుబాటు చర్యలు లేకపోవడం తదితర పరిణామాలతో వైఎస్సార్సీపీలో ఉండటం అనవసరమనే భావనకు ఆ పార్టీ నేతలు వచ్చేస్తున్నారు. ఎంపీలు మొదలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్యనేతలు తమ రాజకీయ భవిష్యత్తు కాపాడుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగానే తొలుత పలువురు రాజ్యసభ సభ్యులు వైఎస్సార్సీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. మోపిదేవి వెంకటరమణరావు, బీద మస్తాన్ రావు నేడు రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించనున్నారు. దీనికోసం వారిద్దరు దిల్లీకి చేరుకున్నారు. వారిదారిలోనే మరో ఆరుగురు సభ్యులు ఎంపీ పదవితో పాటు వైఎస్సార్సీపీకి రాజీనామాలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ మరో షాక్ - ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా
మరికొంతమంది రెడీ: రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్న 8 మందిలో నలుగురు టీడీపీ వైపు, మరో నలుగురు బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. రాజకీయంగా ఉన్నవారు టీడీపీ, వ్యాపార వర్గాల నుంచి వచ్చిన వారు బీజేపీ వైపు వెళ్లవచ్చని తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామాలకు ముందు లేదా వారు చేసినప్పుడే వ్యాపార రంగం నుంచి వచ్చి ఎంపీలైన మరో ముగ్గురు రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం.
జగన్‌కు వ్యాపారాల్లో, రాజకీయాల్లో, ఇటు రాష్ట్రంలో, అటు దిల్లీలోనూ ఇంతకాలం అండగా ఉన్న మరో ఎంపీ కూడా వ్యాపార రంగం నుంచి వచ్చిన వారితో పాటే రాజీనామా చేసే అవకాశం ఉందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. జగన్‌కు దగ్గరి బంధువు ఒకరు, ఆయనకు మొదట్నించీ రాజకీయంగా తోడుగా నిలిచిన నేత, ఇక్కడితో రాజకీయాల నుంచి విరమించుకుందామనే ఆలోచనలో ఉన్న సభ్యుడుతో పాటు మరోకరు మొత్తంగా ముగ్గురు మాత్రం వైఎస్సార్సీపీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారని ఇప్పటివరకు ఉన్న సమాచారం.
వైఎస్సార్సీపీకి భారీ షాక్! - రాజీనామాకు సిద్ధమైన ఎంపీలు - YSRCP MPS RESIGN
రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభలో మొత్తం 11 స్థానాలున్నాయి. 2019లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకొచ్చాక 2020లో, 2022, 2024 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆ మొత్తం 11 స్థానాలనూ కైవసం చేసుకుంది. దీంతో రాజ్యసభలో సంఖ్యాబలం పరంగా నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో జగన్ అహంకారం తలకెక్కినట్లుగా తెలుగుదేశం పార్టీని చులకన చేస్తూ అప్పట్లో ఎన్నో బీరాలు పలికారు. 2024 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయంపాలయ్యాక ఆ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. అవమానాలు, ఇబ్బందులూ ఉన్నా అంతకాలం ఓపికతో అదే పార్టీలో కొనసాగిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇప్పుడు వైఎస్సార్సీపీని వీడుతున్నారు.
రాజ్యసభ సభ్యుల బాటలోనే పలువురు ఎమ్మెల్సీలు వైఎస్సార్సీపీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. పోతుల సునీత ఇప్పటికే తన ఎమ్మెల్సీ పదవికి, వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఆమె బాటలోనే మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పోతుల సునీత చేరిక పట్ల తెలుగుదేశం నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ఆమె బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
వైఎస్సార్సీపీకి మరో షాక్ - పార్టీకి రాజీనామా చేసిన ఏలూరు మేయర్