YSRCP MLC Duvvada Srinivas Issue: 'రాజకీయాల్లో అన్నీ కోల్పోయాను, కుటుంబాన్ని కోల్పోయాను, ఒంటరిని అయిపోయాను, నాకు మీరే దిక్కు'.. అంటూ ఎన్నికల ప్రచారంలోను, ఆ తర్వాత తనను కలసిన వారి ఎదుట వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కంటతడిపెడుతుంటారు. 'అది, నిజమైన కన్నీరు కాదు.. మొసలి కన్నీరు, వ్యక్తిత్వంలేని ఆయన వైఖరితో కుటుంబం మాత్రమే కాదు, నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలు, పార్టీ కూడా రోడ్డున పడి బలయ్యారు'.. అని సాక్షాత్తు కట్టుకున్న భార్య, కన్న కుమార్తెలు కన్నీటిపర్యంతం అవుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం గత రెండు రోజులుగా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయనను కలిసేందుకు టెక్కలి జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన ఇంటికి వెళ్లిన ఇద్దరు కుమార్తెలకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. లోపలికి అనుమతించక పోవడంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి గం.2 వరకు గేటు వెలుపలే కారులో కూర్చొని నిరీక్షించి వెనుదిరగాల్సి వచ్చింది.
పార్టీని, కుటుంబాన్ని నట్టేటముంచేసి: అయితే శుక్రవారం ఉదయం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్న అతడి భార్య దువ్వాడ వాణి, పెద్ద కుమార్తె హైందవి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ గౌరవాన్ని, కుటుంబ నేపథ్యాన్ని, రాజకీయ జీవితాన్ని మంటగలుపుతున్నారంటూ తూర్పారబట్టారు. తన తాత లక్ష్మీపతిదొర, తండ్రి రాఘవరావు దొర, తాను వందల ఎకరాల అమ్ముకుని రాజకీయం చేశామని, తన భర్తగా ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ చేరి నమ్ముకున్న కార్యకర్తల్ని, పార్టీని, కుటుంబాన్ని నట్టేటముంచేసి రోడ్డున పడేశారని భార్య వాణి విమర్శించారు.