YSRCP Leaders Attacks on Journalists: వైఎస్సార్సీపీ నేతల అరాచకాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. వారికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో జర్నలిస్టులను కూడా వదలటం లేదు. ఇసుక మాఫియా అరాచకాలను బయటపెట్టేందుకు వెళ్లిన అమరావతి 'న్యూస్ టుడే' కంట్రిబ్యూటర్పై ఇటీవల దాడికి చేయగా.. తాజాగా మరో జర్నలిస్టుపై దాడికి తెగబడ్డారు. ఇలా తమకు అడ్డొచ్చిన వారందరిపై ఉక్కుపాదం మోపుతూ వైఎస్సార్సీపీ అరాచకాలకు అడ్డే లేదన్నట్లుగా పేట్రేగిపోతున్నారు.
'మీడియాపై జగన్ ఫ్యాక్షన్ దాడి':అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం 'సిద్ధం' సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టు ఫొటోలు తీయడం నిషిద్ధమా, నేరమా అని నిలదీశారు. ఇది మీడియాపై జగన్ చేసిన ఫ్యాక్షన్ దాడి అని మండిపడ్డారు. ఒక పత్రిక, ఛానెల్ యజమాని అయిన జగన్ ఇటువంటి దాడులు ప్రోత్సహించడం, తన సంస్థల్లో పనిచేసే వారందరినీ రిస్క్‌లో పెట్టడమేనని దుయ్యబట్టారు.
రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నేతలు - ఈనాడు విలేకరిపై దాడి
'భారత రాజ్యాంగం అంటే జగన్ సర్కార్‌కు లెక్కలేదు':వైఎస్సార్సీపీ నేతలు ఓటమి భయంతో జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గం వైఎస్సార్సీపీ 'సిద్ధం' సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ కృష్ణపై వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడి వారి అరాచకాల పరాకాష్టకు నిదర్శనమన్నారు. విధినిర్వహణలో భాగంగా జర్నలిస్టు ఫొటోలు తీస్తే వైఎస్సార్సీపీ నేతలకు అంత ఉలుకెందుకో అని నిలదీశారు.