YSRCP Govt Scam on Muggurai Mines Tenders:అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లి మండలం మంగంపేట వద్ద ఏపీఎండీసీ పరిధిలోని గనుల్లో సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ల ముగ్గురాయి విక్రయాలకు జనవరి 24న టెండర్లు పిలిచారు. ఇందులో కనీస ధర మెట్రిక్ టన్నుకు పన్నెండు వందలుగా నిర్ణయించారు. వివిధ పన్నులు, ఫీజులు అదనంగా ఉంటాయని పేర్కొన్నారు. రెండేళ్ల కిందట ముగ్గురాయి విక్రయాలకు ఖరారుచేసిన టెండర్లలో కనీస ధర 1670గా ఉంది. దీనికి సీనరేజ్ ఫీజు, సెస్, జిల్లా ఖనిజ నిధి, మెరిట్, లోడింగ్, వేయింగ్ ఛార్జెస్, జీఎస్టీ తదితరాలన్నీ కలిపి 2108 చొప్పున ఇప్పటిదాకా విక్రయిస్తున్నారు.
ఈ లెక్కన తాజా టెండర్లలో కనీస ధర మెట్రిక్ టన్నుకు 1670గా పేర్కొనాలి. కానీ 470 రూపాయిల చొప్పున తగ్గించడం వెనుక అస్మదీయులకు భారీ ప్రయోజనం కల్పించే ఉద్దేశమున్నట్లు తెలుస్తోంది. కోటి మెట్రిక్ టన్నులకు లెక్కిస్తే 470 కోట్ల మేర కేవలం కనీస ధర రూపంలోనే ఏపీఎండీసి నష్టపోనుంది.
జగనన్న మార్క్ మోసం- నా ఎస్సీ, నా ఎస్టీ అంటూనే సంక్షేమాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తూట్లు
ప్రస్తుతం మార్కెట్‌లో ఎ, బి గ్రేడ్‌ల ముగ్గురాయికి కొరత ఉంది. సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్‌లకు డిమాండ్ ఉంది. మంగంపేట గనుల్లోనూ ఒకటి రెండేళ్లలో ఏ గ్రేడ్ ముడిఖనిజం పూర్తిగా అయిపోతుంది. తర్వాత బీ గ్రేడ్‌తోపాటు, సీ, డీ, డబ్ల్యూకి మరింత డిమాండ్ వచ్చి ధర పెరుగుతుంది. ఇవన్నీ తెలిసి కూడా కనీస ధర తగ్గించారు. పైగా ఏడాదికోసారి టెండర్లు పిలిస్తే, రేపటి ధరలకు అనుగుణంగా అధిక రేట్లు నిర్ణయించి, ఎక్కువ రాబడిని పొందే అవకాశం ఉండేది. అలా కాదని, ఐదేళ్ల కాలానికి ఒకేసారి కోటి మెట్రిక్ టన్నులకు టెండర్లు పిలిచారు. టెండర్ నిబంధనలు ఎక్కువ మంది పోటీ పడకుండా పొందుపరిచారు. టెండరు దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలంటేనే ఫీజు, జీఎస్టీ కలిపి 29.5 లక్షలు చెల్లించాలి. ఇది వెనక్కి ఇవ్వరు. అంత సొమ్ము ఎందుకు వెచ్చించాలనే ఉద్దేశంతో కొందరు వెనక్కి తగ్గుతారు.