YSRCP Chief Jagan Cheating with Promises : పంచ పాండవులు ఎంత మంది అని అడిగితే నలుగురు అని చెప్పి, మూడు వేళ్లు చూపించాలనుకుని, రెండు వేళ్లు చూపించబోయి, చివరికి ఒక్క వేలు పైకెత్తాడట. అసమర్ధత, అజ్ఞానం, అమాయకత్వానికి నిదర్శనంగా చెప్పుకొనే ఈ సందర్భం ఇప్పుడు జగన్ హామీల విషయంలోనూ గుర్తొస్తోంది.
'ఎన్నికల మ్యానిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటిది. ప్రతి రోజూ మ్యానిఫెస్టోను చూసుకుంటూ ఏకంగా 99 శాతం వాగ్దానాలను అమలు చేసింది మీ జగన్, వైఎస్సార్సీపీ మాత్రమే అని చెప్పడానికి గర్వపడుతున్నా.'
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో అందుకున్న ఇదే రాగాన్ని ఇప్పుడు ఎన్నికల సమయంలోనూ ఆలపిస్తున్నారు. జగన్ 99శాతం హామీలు అమలు చేశామని చెప్తున్నా సబ్బండ వర్గాలు మాత్రం మరి మా సమస్యల మాటేంటి ? మాకిచ్చిన హామీల గతేంటి ? అని ప్రశ్నిస్తున్నాయి. ఒక్క బటన్ నొక్కుడు తప్ప చేసిన అభివృద్ధి ఏదీ ? అని నిలదీస్తున్నాయి.
'దళితులకు 27 సంక్షేమ పథకాలను దూరం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది'
వ్యాపారానికి ఏ మాత్రం తీసిపోని లాజిక్ :ఛార్మ్ ప్రైసింగ్ (Charm pricing) మార్కెట్, షాపింగ్ మాల్స్‌లో వస్తువుల ధరలు 49, 99, 999, 9999 ఇలా ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. ఒక వస్తువుని రూ.100 విక్రయించాలనుకునే వ్యాపారి ఒక్క రూపాయి తగ్గించి దాని ధరను రూ.99గా మార్చి వినియోగదారులను ఆకట్టుకుంటాడు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు చేసే మాయ ఇది. 'బాటా రేట్'గా మార్కెట్లో ప్రచారంలో ఉన్న ఈ లాజిక్‌ను జగన్ కూడా తనదైన శైలిలో రాజకీయాలకు వాడుకుంటూ రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాడు.
ఆ ఒక్కటి ఏమిటో?! :99శాతం హామీలు అమలు చేశామంటూ గొప్పలు చెప్తున్న జగన్ మిగిలిన ఆ ఒక్కటేమిటో ఎక్కడా చెప్పడం లేదు. 'సీపీఎస్ (CPS) రద్దు, మద్యపాన నిషేధం' హామీలు మాత్రమే అమలుకు నోచలేదని జగన్ పదే పదే డప్పు కొడుతున్నా పెండింగ్ సమస్యలతో ఉద్యోగులు ఎందుకు రగిలిపోతున్నట్టు? జాబ్ క్యాలెండర్ ఏమాయె? అని నిరుద్యోగులు ఎందుకు నిలదీస్తున్నట్టు? మద్య నిషేధం (Alcohol prohibition) హామీ ఏమైందని అక్క, చెల్లెమ్మలు ఎందుకు ప్రశ్నిస్తున్నట్టు? కరువు, కరెంటు కోతలపై అన్నదాతలు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు? హామీల అమలు చేయండి జగనన్నా అని ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు రోజుల తరబడి ఎందుకు పోరాడినట్టు?