YS Sharmila Blames CM Jagan and Avinash Reddy:ముస్లిములకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడు కలవలేదని, కానీ ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ పార్టీతో అంటగాగుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల రెడ్డి విమర్శించారు. షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని, బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతాడని షర్మిల ప్రశ్నించారు. జగన్ ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేశాడని గుర్తు చేశారు. ఇమామ్ లకు 15 వేలు వేతనం అన్నాడని, ముస్లీం బ్యాంక్ అంటూ మోసం చేశాడని పేర్కొన్నారు. చనిపోతే 5 లక్షల భీమా అన్నాడు, ఇచ్చాడా అని నిలదీశారు. ముస్లీం పక్షాన నిలబడేది కాంగ్రెస్ మాత్రమేనని షర్మిల అన్నారు. బాబు, జగన్ ఇద్దరు ముస్లీంల పక్షాన లేరని తెలిపారు. బీజేపీ రాష్ట్రానికి ఎం చేసిందని వీళ్లు బానిసలు అయ్యారని వ్యాఖ్యానించారు. విభజన హామీలు ఒక్కటి సైతం బీజేపీ నెరవేర్చలేదని వెల్లడించారు హోదాపై బీజేపీ మోసం చేసిందని, వైఎస్సార్ బతికి ఉంటే కడప స్టీల్ ఎప్పుడో పూర్తి అయ్యేదని షర్మిల తెలిపారు. కడప స్టీల్ ను శంకుస్థాపన ప్రాజెక్ట్ కింద మార్చారని ఎద్దేవా చేశారు. కడప స్టీల్ పరిశ్రమ కోసం సీఎం జగన్ మూడు సార్లు శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు.