AP Assembly Sessions 2024 Updates :వైఎస్సార్సీపీ సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాల చిట్టాను విప్పనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం అక్రమాలపై శ్వేతపత్రాన్ని శాసనసభ వేదికగా ప్రకటించనున్నారు. తొలుత ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లుని సభలో చర్చించి ఆమోదించనున్నారు. తర్వాత విజయవాడలో యూనివర్సిటీ ఆఫ్ హెల్త్‌సైన్సెస్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించి, వైఎస్‌ఆర్ పేరు పెడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టసవరణ రద్దు చేసే బిల్లుపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో విశాఖలో కాలుష్య నియంత్రణ, రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులు, కేజీహెచ్‌లో పడకలు, సిబ్బంది కొరత, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ప్రశ్నలకు మంత్రులకు సమాధానాలు ఇవ్వనున్నారు. అలాగే ధాన్యం రైతుల సమస్యలు, టెంపుల్ టూరిజం, ఇసుక తవ్వకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మారిటైమ్ బోర్డు ద్వారా కృష్ణపట్నం పోర్టు లీజు, మత్యకారులకు జీవో 217 ఇబ్బందులపై సమాధానాలు ఇస్తారు.
శాసనమండలిలో శ్వేతపత్రం విడుదల చేయనున్న మంత్రి కొల్లు రవీంద్ర : శాసనమండలిలో నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర శ్వేతపత్రం విడుదల చేస్తారు. ప్రశ్నోత్తరాల్లో గత ప్రభుత్వం లో కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాలు, ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ పథకం, పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్, విద్యార్థులకు ఆర్థిక సాయం, నీటిపారుదల రంగ అభివృద్ధి, అపరిష్కృత విభజన హామీలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో బాలికల అదృశ్యం కేసులు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు నియామకం, 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు టోఫెల్ పరీక్ష, పీఎం విశ్వకర్మ పథకంపై సమాధానాలు ఇస్తారు.