AP Assembly Sessions 2024 Updates :గడచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో వివరించనున్నారు. జగన్ ఏలుబడిలోని అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు వంటి అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించనున్నారు. భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునేలా గత పాలకులు వ్యవహరించిన తీరు, సాధారణ పౌరులపైనా కేసులను నమోదు చేసిన వ్యవహారం, ఎస్సీలపై దాడులు, హత్య కేసులు వంటి అంశాలనూ ప్రస్తావించే అవకాశముంది.
White Paper on Law and Order in AP : అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించనున్నారు. డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రమణ్యం, కోడి కత్తి కేసు వ్యవహారంలో గత సర్కార్ వైఖరి, వివేకా హత్యకేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నట్టు సమాచారం. గడచిన ఐదేళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదైన అంశాలనూ శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల మృతిచెందిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు, యెర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయ్ రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు శాసనసభ సంతాపం ప్రకటించనుంది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ , సంఘ విద్రోహశక్తుల నియంత్రణ, విశాఖలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సౌకర్యాలపై మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాల రద్దు, టిడ్కో గృహాలు, సుప్రీంకోర్టులో కేసులు , ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేసీ కెనాల్ మళ్లింపు వంటి అంశాలపై మంత్రులు సమాధానం ఇస్తారు.