Vigilance investigation in Tirumala: కలియుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుమలలో ఐదేళ్లపాటు వైఎస్సార్సీపీ సాగించిన అడ్డగోలు దోపిడీపై కూటమి ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక శ్రీవారి దర్శనానికి వచ్చిన చంద్రబాబు ఐదేళ్ల అరాచక పాలనపై ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తామని ప్రకటించారు. వెనువెంటనే ఐదేళ్లుగా అన్నీ తానై వ్యవహరించిన అధికారి ధర్మారెడ్డిని తప్పించి టీటీడీ ఈవోగా శ్యామలరావును నియమించారు.
విధుల్లో చేరిన ఈవో శ్యామలరావు భక్తులకు అందించాల్సిన సేవలపై దృష్టి సారించారు. ఆర్థిక పరమైన అక్రమాలను నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర విజిలెన్స్ విభాగం నుంచి ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ స్థాయి అధికారి కరీముల్లా షరీఫ్ నేతృత్వంలో వివిధ శాఖలకు చెందిన 40 మంది అధికారుల బృందం టీటీడీలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తోంది.
'టీటీడీ మాజీ ఈవో, ఛైర్మన్ల అవినీతిపై విచారణ జరపాలి' - TDP Leaders Complaint on corruption
విజిలెన్స్ అధికారుల తనిఖీలు, రికార్డుల స్వాధీనం, వాంగ్మూలాల సేకరణతో టీటీడీలోని కీలక విభాగాల్లో పనిచేసిన ఉన్నతాధికారులు, సిబ్బందిలో కలవరం మొదలైంది. పూర్వ ఈవో ధర్మారెడ్డికి సన్నిహితంగా ఉండి కీలకంగా వ్యవహరించిన అధికారులు విజిలెన్స్ సోదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ధర్మకర్తల మండలి చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి కమీషన్ల కోసం నిబంధనలను ఉల్లంఘించి ఇంజినీరింగ్ పనులకు నిధులు మళ్లించారన్న విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విభాగంపై విజిలెన్స్ బృందం ప్రత్యేకంగా దృష్టి సారించి సోదాలు చేస్తోంది. అవసరమైన పనులకే నిధులు కేటాయించారా కమీషన్ల కోసం పనులు చేపట్టారా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఇంజినీరింగ్ విభాగంలో కీలక స్థానాల్లో ఉన్న వారిని ప్రశ్నిస్తుండడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
టీటీడీలో అక్రమాలను త్వరలోనే భక్తుల ముందు ఉంచుతాం: భాను ప్రకాష్‌రెడ్డి - BJP Bhanu Prakash Reddy
టీటీడీ విజిలెన్స్ బృందం 15 అంశాలపై దృష్టి సారించింది. శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు, వైఎస్సార్సీపీ నాయకులకు కేటాయించిన వీఐపీ బ్రేక్, ప్రొటోకాల్ దర్శనాలు, శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డూ తయారీ ముడిసరుకుల కొనుగోళ్లు, ఎస్టేట్ విభాగం ద్వారా అతిథిగృహాల నిర్మాణం, దుకాణాల లైసెన్సుల రెన్యువల్స్, నగదు, బ్యాంకు లావాదేవీలు, డిపాజిట్లు, ఆభరణాల భద్రత, తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో టేబుల్ అజెండాగా చర్చించిన పనులకు నిధుల మళ్లింపు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సమకూరిన నిధుల వినియోగం వంటి వాటిని పరిశీలిస్తున్నారు.
వైఎస్సార్సీపీ నేతలకు పరిమితికి మించి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపుపై విజిలెన్స్ బృందం విచారణ చేస్తోంది. తిరుమల ఈవో కార్యాలయంలో పలుమార్లు తనిఖీ చేసింది. ఇద్దరు ముఖ్య అధికారుల నుంచి వాంగ్మూలం రికార్డు చేసి టికెట్ల కేటాయింపునకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్టు సమాచారం. ఆర్జితసేవా టికెట్ల కార్యాలయం ఐటీ విభాగంలో సోదాలు నిర్వహించారు. ప్రభుత్వం మారిన వెంటనే రికార్డులను తారుమారు చేశారనే ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు డేటా పొందినట్టు సమాచారం.
శ్రీవాణి ట్రస్టు టికెట్ కౌంటర్లను తనిఖీ చేసి నిధుల వివరాలు సేకరించారు. లడ్డూ, అన్నప్రసాదాల తయారీకి అవసరమైన ముడిసరుకుల కొనుగోలులో అనుసరించిన విధానాలు, నాణ్యత ప్రమాణాల పరిశీలనపైనా విచారణ చేపట్టారు. టీటీడీలో అక్రమాలను నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విజిలెన్స్ బృందానికి ప్రభుత్వం 15 రోజుల కాలపరిమితి విధించినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తుండడంతో నిర్దేశించిన గడువును మరో 2 వారాలు పొడిగించాలని విజిలెన్స్ ఉన్నతాధికారి ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం.
టీటీడీలో అక్రమాలపై విచారణ - నిధుల వినియోగంపై లెక్కలు తీస్తున్న విజిలెన్స్ విభాగం - Enquiry on Irregularities in TTD