Vana Mahotsavam Program: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇవాళ జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన వర్షం కారణంగా రద్దయ్యింది. నరసరావుపేట మండలం కాకానిలో వనమహోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. అయితే నరసరావుపేటలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా సభాప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలన్ని బురదమయమయ్యాయి.
సభ కోసం జర్మన్ టెంట్లు ఏర్పాటు చేసినప్పటికీ వర్షపు నీరు సభా ప్రాంగణంలోకి చేరింది. సభికుల కోసం వేసిన కుర్చీలు భూమి లోపలికి దిగబడిపోతున్నాయి. అలాగే పార్కింగ్ ప్రాంతమంతా బురదమయం కావడంతో వాహనాలు ఇరుక్కుపోయాయి. దీంతో ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది అవుతుందని అధికారులు భావించారు. పరిస్థితిని సీఎం కార్యాలయానికి తెలియజేశారు.
మరోవైపు మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుండడంతో సీఎం, డిప్యూటీ సీఎం హెలికాఫ్టర్లో బయలుదేరడానికి వాతావరణం అనుకూలించదని భద్రతా అధికారులు సూచించారు. దీంతో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గుంటూరు జిల్లా పేరిచెర్ల నగర వనం వద్ద సభ నిర్వహించాలని భావించినప్పటికీ అక్కడ కూడా వర్షం కురుస్తుండడంతో కార్యక్రమం సాధ్యం కాదని అధికారులు, పోలీసులు తేల్చారు. దీంతో పర్యటన రద్దయ్యింది. ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిన అధికారులు మరోచోట నిర్వహించడానికి ప్రత్యామ్నాయాలు చూస్తున్నారు.