టీడీపీ రెండో జాబితా విడుదల - అభ్యర్థుల సంబరాలు - గెలుపుపై ధీమా Telugu Desam Leaders Celebrations :తెలుగుదేశం అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల సంబరాల్లో మునిగిపోయారు. చాలాచోట్ల బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు తినిపించుకున్నారు. తమ నేతలకు అధిష్టానం సీట్లు కేటాయించటంపై సంతోషం వ్యక్తం చేశారు. కూటమి గెలుపు కోసం మరింత ఉత్సాహంగా పని చేసి, జగన్‌ను గద్దె దించుతామని నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో గెలుపు తమదేనని టికెటు దక్కించుకున్న నేతలు స్పష్టం చేశారు.
పిడుగురాళ్ల మాధవి :గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు పిడుగురాళ్ల మాధవి. బీసీ వర్గానికి చెందిన మాధవి గుంటూరులోని వికాస్ ఆసుపత్రి డైరెక్టర్‌గా ఉన్నారు. మంత్రి విడదల రజిని వైఎస్సార్సీపీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు, పార్టీ కార్యకర్తల అండతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తానని మాధవి విశ్వాసం వెలిబుచ్చారు.
టీడీపీ రెండో జాబితా విడుదల చేసిన చంద్రబాబు- 34మందికి చోటు
యరపతినేని శ్రీనివాసరావు :పల్నాడు జిల్లా గురజాల టికెట్ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు కేటాయించటంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. రోడ్డుపైకి వచ్చి బాణసంచా కాల్చారు. రెండో జాబితాలో తన పేరు ఖరారు కావటంపై యరపతినేని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కృజ్ఞతలు తెలిపారు. తర్వాత జనసేన పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. టీడీపీ, జనసేన అభిమానులు యరపతినేనిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
భాష్యం ప్రవీణ్ : గుంటూరు జిల్లా పెదకూరపాడు టికెట్ భాష్యం ప్రవీణ్‌కు దక్కడంతో గుంటూరులోని ఆయన కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చారు. అటు దొడ్లేరులోనూ ఆయన అభిమానులు రోడ్లమీదకు వచ్చి సంబరాలు చేసుకున్నారు.
కందికుంట యశోద :శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తెలుగుదేశం టికెట్ కందికుంట యశోదను వరించటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకున్నారు. కందికుంట యశోదను అభ్యర్థిగా ప్రకటించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు.
పిఠాపురం నుంచి బరిలో పవన్‌కల్యాణ్ - స్వయంగా వెల్లడించిన జనసేనాని
నంద్యాల వరదరాజులురెడ్డి :వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. వరదరాజులురెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. 1985 నుంచి 2004 వరకు ఐదుసార్లు ఎమ్మల్యేగా గెలిచిన వరదరాజులురెడ్డి రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలవటం ఖాయమన్నారు.
కందుల నారాయణరెడ్డి :ప్రకాశం జిల్లా మార్కాపురం అభ్యర్థి కందుల నారాయణరెడ్డి ఇంటి వద్ద టీడీపీ అభిమానులు బాణసంచా కాల్చారు. తనపై నమ్మకంతో సీటు కేటాయించిన చంద్రబాబుకు మార్కాపురంలో గెలిచి బహుమతిగా ఇస్తానని నారాయణరెడ్డి అన్నారు.
నసీర్ అహ్మద్ : గుంటూరు తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా నసీర్ అహ్మద్ పేరుని పార్టీ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగాకార్యకర్తలు కేరింతలు కొట్టారు. నసీర్ని ఎత్తుకుని సంతోషం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్సి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. టీడీపీ అధికార ప్రతినిధిగా వైసీపీ ప్రభుత్వ అక్రమాలు, అరాచకాలపై నిలదీస్తూ వచ్చారు. ఇప్పుడు మరోసారి టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు.
బీజేపీ పోటీచేసే అసెంబ్లీ స్థానాలు ఖరారు - కైకలూరు నుంచి సోము వీర్రాజు