Telangana Minister Sridhar Babu on Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్తులో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏపీకి గ్లోబల్ కేపబిలిటీ ఉందని, కోస్తా ప్రాంతం, అపార వనరులు ఉన్నాయన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాల ఆలోచనలతో ఉన్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏపీకి మంచి పరిశ్రమలు వస్తాయని, ఇప్పటికే కొన్ని ఎంవోయూలు చేసుకున్నారని, వాటి వివరాలను ఏపీలోనే ప్రకటిస్తామని లోకేశ్ దావోస్‌లో చెప్పారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రయత్నాలు బాగున్నాయి: పెట్టుబడులు రాబట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు బాగున్నాయని కొనియాడారు. పెట్టుబడుల విషయంలో వారు వ్యూహాత్మకంగా ఉన్నారన్నారు. ఏపీకి అనుకూలతలు, పెట్టుబడుల కోసం చంద్రబాబు వ్యూహాలు, ప్రయత్నాలు చాలా బాగున్నాయని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో కంపెనీలు ఏపీకి తీసుకెళ్లి, ఇక్కడ ఆటంకాలు సృష్టించే ఆలోచన చంద్రబాబుకు ఏ మాత్రం లేదన్నారు. హైదరాబాద్ ఇంకా అభివృద్ధి కావాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరుకుంటున్నారని తెలిపారు.
వచ్చే మూడేళ్లలో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. చంద్రబాబు శారీరంకగా చాలా దృఢంగా ఉన్నారని, దావోస్‌లో మైనస్ 11 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో తామంతా స్వెటర్లు వేసుకుంటే, చంద్రబాబు మాత్రం సాధారణ డ్రెస్‌లోనే ఉన్నారని శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో ఈ విషయాలను శ్రీధర్ బాబు పంచుకున్నారు.