TDP Leaders Fires on Stone Pelting Case :సీఎంపై రాయి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలైందని చంద్రబాబు అన్నారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై వైసీపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. సీఎంపై రాయి ఘటనలో బొండా ఉమను ఇరికించే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుచేసే అధికారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం వల్ల కుట్రలు పెంచుతున్నారని, హత్యాయత్నం అంటూ తెదేపాపై బురద వేయాలని యత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రయత్నాలను ప్రజలు ఛీత్కరిస్తున్నారని తెలిపారు. నాలుగు రోజులైనా ఘటనపై పోలీసులు ప్రకటన చేయలేదన్నారు. నిందితులంటూ వడ్డెర కాలనీ యువకులను తీసుకుపోయారని చంద్రబాబు తెలిపారు. సీఎం జగన్ గులకరాయి డ్రామాలో బలహీన వర్గాలకు చెందిన యువకులను బలి చేస్తున్నారని టీడీపీ ధ్వజమెత్తింది. ఎన్నికల్లో సానుభూతి కోసం చేస్తున్న కుట్రల్ని తెలుగుదేశం చూస్తూ ఊరుకోబోదని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు.
మీరే బాధ్యత వహించాలి :సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ రెడ్డి కుట్ర చేశాడని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో కోడికత్తి డ్రామాలో ఒక దళిత బిడ్డను ఐదేళ్ల పాటు జైలు పాలు జేశారని మండిపడ్డారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన సతీష్ అనే అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారని దుయ్యబట్టారు. కిరాయి ఇస్తామని తీసుకెళ్లి ఇవ్వకుండా ఉంటే కడుపులో మండి గులకరాయి విసిరాడని అచ్చెన్నాయుడు విమర్శించారు. దీనికి టీడీపీకి సంబంధం ఏంటని, తమపై నెట్టడానికి సిగ్గనిపించటం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడికత్తి డ్రామా సమయంలో అధికారంలో ఉన్నవారే బాధ్యత వహించాలన్నారన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న మీరే బాధ్యత వహించాలని అచ్చెన్న అన్నారు.
వైఎస్సార్సీపీ ఓటమి తప్పదు :జగన్‌పై గులకరాయి దాడి కేసులో కుట్ర జరుగుతోందని టీడీపీ నేత పట్టాభి రామ్ ధ్వజమెత్తారు. తెలుగుదేశం నేతలను ఇరికించాలని చూస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. నాటకాలు అని ప్రజలకు స్పష్టంగా అర్ధమైందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి తప్పదని పేర్కొన్నారు.