TDP-Janasena To Announce BC Declaration : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన 'జయహో బీసీ (Jayaho BC)' సభలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. వెనుకబడిన తరగతుల ఆర్థిక, రాజకీయ, సామాజిక అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా మొత్తం పది ప్రధాన అంశాలతో ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామని పది నెలల క్రితమే ప్రకటించిన తెలుగుదేశం దాన్ని డిక్లరేషన్‌లోనూ చేర్చింది. జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలు దారుణ హత్యకు గురయ్యారని, దాడులు, దౌర్జన్యాల నుంచి బీసీలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని ఇరు పార్టీల అధినేతలు తెలిపారు. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడతామని వెల్లడించారు.
బీసీల దశ, దిశ మార్చడం కోసమే 'బీసీ డిక్లరేషన్': చంద్రబాబు
TDP Janasena Alliance :బీసీలకు 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని తెలుగుదేశం, జనసేన ప్రకటించాయి. పింఛను మొత్తాన్ని 4 వేలకు పెంచుతామని తెలిపాయి. చంద్రన్న బీమా పునరుద్ధరిస్తామని, బీమా పరిహారాన్ని 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చాయి. పెళ్లికానుక పునరుద్ధరించి లక్ష చొప్పున అందజేస్తామని తెలిపాయి. బీసీ ఉప ప్రణాళిక ద్వారా వారి అభివృద్ధికి ఏటా 30 వేల కోట్ల చొప్పున అయిదేళ్లలో లక్షా 50 వేల కోట్ల ఖర్చుచేస్తామని వెల్లడించాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 75 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించిందని ఆరోపించాయి. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ సబ్‌ప్లాన్ నిధులను వారి కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడం వల్ల 16,800 మంది బీసీలు పదవులకు దూరమయ్యారని స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని వెల్లడించాయి. చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేస్తామని తెలిపాయి. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చాయి. జనాభా తక్కువగా ఉండి, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని బీసీ వర్గాలవారికి కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పిస్తామని ప్రకటించాయి.