Nara Lokesh as Deputy CM Issue :మంత్రి నారా లోకేశ్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికే పలువురు నాయకులు స్పందించారు. ఈ విషయంపై టీడీపీ హైకమాండ్ దృష్టి సారించింది. ఈ అంశంపై ఇక ఎవరూ మాట్లాడవద్దని అధిష్ఠానం నేతలకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకుంటారని వెల్లడించింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని హైకమాండ్ సీరియస్‌గా చెప్పింది.
అసలేం జరిగదంటే :కొద్ది రోజులుగాలోకేశ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని పలువురు నేతలు బహిరంగంగానే మాట్లాడారు. శనివారం నాడు సీఎం చంద్రబాబు వైఎస్సార్ జిల్లా మైదుకూరులో పర్యటించారు. ఈ క్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేశ్ డిప్యూటీ సీఎం చేయాలని చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే పార్టీ భవిష్యత్ బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదే విషయంపై ఆదివారం నాడు పిఠాపురం తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ కూడా స్పందించారు. టీడీపీ సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత లోకేశ్‌కే దక్కుతుందని, పార్టీకి భవిష్యత్ లేదన్న వారందరికీ యువగళంతో సమాధానం చెప్పారని తెలిపారు. అందుకే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయని చెప్పారు. దీనిపై కొన్ని సోషల్ మీడియాలో, మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదని హితవు పలికారు.