TCS in Visakha :విశాఖపట్నంలో పెట్టుబడులకు ప్రముఖ సంస్థ టాటా గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనుంది. మంత్రి లోకేశ్ ముంబయిలో మంగళవారం టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో జరిపిన సంప్రదింపుల తర్వాత ఆ సంస్థ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఎన్డీయే అధికారం చేపట్టాక విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు టాటా సంస్థ ముందుకు రావడం కీలక ముందడుగు కానుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు ప్రముఖ ఐటీ కంపెనీలు విశాఖలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుండగా ఐటీ రంగం అభివృద్ధికి విశాఖ బాటలు వేయనుంది.
అనువైన వాతావరణమే కారణం
ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి విశాఖలో అనువైన వాతావరణం ఉండటం కలసి వచ్చే అంశంగా విశ్లేషకులు, పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. భోగాపురంలో నిర్మిస్తోన్న అంతర్జాతీయ విమానాశ్రయం కూడా త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తల రాకపోకలకు మరింత వెసులుబాటు పెరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ టెక్‌మహీంద్రా, సింబయోసిస్‌తో పాటు పలు ప్రముఖ ఐటీ సంస్థలు కొలువుదీరాయి. ఇప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 'ఏ హబ్' పేరిట ఇన్‌క్యుబేషన్ కౌన్సిల్ అందుబాటులో ఉండగా విశాఖ ఐటీ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందడానికి ఇవన్నీ దోహదం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
విశాఖ సాగర తీరంలో టీసీఎస్ - మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన
ఏపీ వైపు ప్రముఖ సంస్థల చూపు
పారిశ్రామిక అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కంపెనీలను సంప్రదిస్తోంది. పెట్టుబడులు పెట్టేలా ఉన్న అపార అవకాశాలపై ప్రముఖ సంస్థలతో సంప్రదిస్తోంది. లులు, ఓబెరాయ్, బ్రూక్‌ఫీల్డ్, సుజలాన్ వంటి సంస్థలు సుముఖత తెలిపాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజలతో ముఖాముఖిలో మాట్లాడుతూ ప్రఖ్యాత ఐటీ కంపెనీల ద్వారా యువతకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మంగళవారం ముంబయిలోని టాటా సన్స్ కార్యాలయం బాంబే హౌస్‌లో ఆ సంస్థల ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో మంత్రి సమావేశమయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాలకు తోడు విశాఖలో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆయనకు వివరించారు. సమావేశం అనంతరం విశాఖలో టీసీఎస్ సెంటర్ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో ఈవీ, ఏరో స్పేస్, స్టీల్, హోటల్స్, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘విశాఖలో టీసీఎస్ సెంటర్ ఏర్పాటు ద్వారా 10 వేల మందికి ఉపాధి కల్పించేందుకు ఆ సంస్థ ఛైర్మన్ అంగీకరించడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ నినాదమని, ప్రముఖ కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం స్వాగతిస్తోందని వెల్లడించారు.
ఉపాధి కల్పనపై ప్రభుత్వ దృష్టి
ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వచ్చే ఐదేళ్లలో సుమారు 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెట్టింది. విశాఖ కేంద్రంగా ఐటీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ), డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం విశాఖ మిలీనియం టవర్స్ ఐటీ రంగ సంస్థలకు కేటాయించనుంది. ఏపీ ఏఐ మిషన్ పేరిట పాఠశాల స్థాయి నుంచే బోధన, స్టార్టప్ ఎకో సిస్టం, పరిశోధనలకు ప్రాధాన్యమిస్తోంది. మొత్తంగా రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఐటీ రంగానిది కీలక భూమిక అని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
టాటా సన్స్ బోర్డ్ చైర్మన్‌తో మంత్రి లోకేశ్- వేచి చూడాలంటూ ఆసక్తికరమైన పోస్ట్
రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు - అన్ని జిల్లాలకు ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ: లోకేశ్ - Lokesh Speech Visakha CII Summit