Raghuramakrishna Raju Unanimously Elected as Deputy Speaker:ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు శాసనసభలో ప్రకటన చేయగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రఘురామకృష్ణరాజును స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. ఉపసభాపతిగా బాధ్యతలు స్వీకరించిన రఘురామకృష్ణరాజును స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభినందించారు. తర్వాత మంత్రులతో పాటు సభ్యులందరూ ఒక్కొక్కరూ వెళ్లి రఘురామను అభినందించారు.
సీఎం చంద్రబాబుకు బుణపడి ఉంటా: డెమెక్రసీకి బ్యాక్ బోన్ శాసనసభ అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు బుణపడి ఉంటానన్నారు. తనను అరెస్టు చేసినప్పడు తన భార్యకు, పిల్లలకు ఆయన స్వయంగా ఫోన్ చేసి మానిటర్ చేస్తున్నామని ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అంటున్నారు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వలేదు దానికి చంద్రబాబు, లోకేశ్ ఏం చేయలేరన్నారు. చందమామ మారాలు మాని ఒక్కరోజు కాదు మొత్తం వచ్చి మాట్లాడితే మైక్ ఆటోమెటిక్ గా ఇస్తారని తెలిపారు. ఇది గౌరవ సభ తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తామని వెల్లడించారు.
పోరాట యోధుడు రఘురామ:ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయ్యిందో రఘురామకృష్ణరాజు రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంతే పాపులర్ అయ్యిందని సీఎం చంద్రబాబు అన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన రఘురామకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఒకే రోజులో ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్, అరెస్టు మూడూ రఘురామపై జరిగాయని చంద్రబాబు గుర్తుచేశారు. పోలీసు కస్టడీలో ఉన్న రఘురామపై దాడి చేయడం దారుణమని వివరించారు. జగన్ రఘురామను పోలీసులతో కొట్టించి, ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చూసి పైశాచిక ఆనందం పొందారని అన్నారు. అప్పుడు రఘురామను రాష్ట్రానికి రానీయని వాళ్లు నేడు ఈయన ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్టు ఇదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని సీఎం చంద్రబాబు అన్నారు.