PM Narendra Modi Speech in Boppudi: ఎన్నికల శంఖారావం మోగాక తన తొలి సభ ఇదేనని ప్రధాని మోదీ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. "నా ఆంధ్ర కుటుంబసభ్యులు అందరికీ నమస్కారం" అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మోదీ ప్రారంభించారు.
డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే అభివృద్ధి ముందడుగు : దేశంలో ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు దాటాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన భారత్ కోసం ఎన్డీఏకు 400 సీట్లకు పైగా రావాలని, అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఇక్కడ ఎన్డీఏను గెలిపించాలని కోరారు. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి రెండింటినీ ఎన్డీఏ సమన్వయం చేస్తుందని తెలిపారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ తెలుగు ప్రజల అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్నారని కొనియాడారు. ఎన్డీఏ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే అభివృద్ధి ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు.
ఏపీకి 10 లక్షల గృహాలు ఇచ్చాం: ఎన్డీఏ అంటే పేదల గురించి ఆలోచించేదని, పేదల కోసం పనిచేసేదని మోదీ అన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద ఏపీకి 10 లక్షల గృహాలు ఇచ్చామన్న మోదీ, పల్నాడు జిల్లాలో 5 వేల గృహాలు ఇచ్చామని తెలిపారు. జలజీవన్ మిషన్ కింద కోటి గృహాలకు ఇంటింటికీ నీరు ఇచ్చామని, ఆయుష్మాన్ భారత్ కింద కోటీ 25 లక్షల మందికి లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద పల్నాడు ప్రజలకు రూ.700 కోట్లు అందించామని మోదీ వెల్లడించారు.
శాండ్, ల్యాండ్, వైన్, మైన్, అన్ని రంగాల్లో సీఎం జగన్ దోపిడీ: చంద్రబాబు
ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలనేదే లక్ష్యం:ఎన్డీఏలో ఉన్న ప్రతి సభ్యుడూ ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంటారని ప్రధాని మోదీ కొనియాడారు. ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు, పవన్ పోరాడుతున్నారన్న మోదీ, ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలనేది తమ లక్ష్యమన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐసర్ నిర్మించామని, విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ ఏర్పాటు చేశామని మోదీ గుర్తు చేశారు. విజయనగరం జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత కోసం అనేక జాతీయ విద్యాసంస్థలు స్థాపించామని, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించామని అన్నారు.
ఇండియా కూటమి అంటే స్వార్థపరుల బృందం:ఇండియా కూటమి, దానిలోని పార్టీలు పరస్పర విరుద్ధంగా పనిచేస్తుంటాయని, కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి పరస్పరం పోటీ పడతారని, దిల్లీలో కలిసిపోతారని విమర్శించారు. ఎన్డీఏ కూటమి పరస్పర విశ్వాసాల ఆధారంగా పనిచేస్తుందని తెలిపారు. ఇండియా కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మిత్రులను వాడుకుని వదిలేస్తుందని పేర్కొన్నారు. ఇండియా కూటమి అంటే అవసరాలకు అనుగుణంగా పరస్పరం సహకరించుకునే స్వార్థపరుల బృందం అని దుయ్యబట్టారు.
రామాలయాన్ని జాతికి అంకితం చేసిన రోజున తెలుగు ప్రజలు ఇంటింటా రాముడికి స్వాగతం పలికారని మోదీ గుర్తు చేసుకున్నారు. అవతార పురుషులు రాముడు, కృష్ణుడిని తెలుగు సమాజంలో సజీవంగా ఎన్టీఆర్ ఉంచారని కొనియాడారు. ఎన్టీఆర్ పోషించిన రాముడు, కృష్ణుడి పాత్రలు అజరామరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగువారికి చేసిన అవమానంతోనే టీడీపీ పుట్టిందని తెలిపారు.