Pawan Kalyan Comments in Jayaho BC Meeting: జగన్ వచ్చిన వెంటనే లక్షలమంది బీసీ కార్మికుల పొట్ట కొట్టారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. వెన్నంటి ఉన్న బీసీలనే జగన్ దెబ్బ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమానికి జగన్ ఇచ్చిన హామీల్లో అమలు చేసింది సున్నా అని మండిపడ్డారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఇసుక రీచ్‌లు, క్వారీలను ఒక కంపెనీకి జగన్ కట్టబెట్టారని, బీసీలకు ఏటా రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు.
బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ లేదని, కుర్చీలు వేయలేదని అన్నారు. బడ్జెట్‌లో మూడో వంతు బీసీలకే అని చెప్పి పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. వైసీపీ పరిపాలనలో 300 మంది బీసీలను చంపేశారన్న పవన్, వైసీపీలో ఉన్న బీసీ నేతలు పునరాలోచించుకోవాలని సూచించారు. బీసీలకు రక్షణ చట్టం అవసరమని, అందుకే మద్దతు తెలిపానని పవన్ స్పష్టం చేశారు.
బీసీలకు సాధికారత ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని పవన్ తెలిపారు. బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కోరుకునే వ్యక్తిని తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. సంపద సృష్టించే స్థాయికి ఎదిగేలా బీసీలకు అండగా ఉంటామని అన్నారు. మత్స్యకారుల కోసం తీర ప్రాంతంలో ప్రతి 30 కిలో మీటర్లకు ఓ జెట్టి ఉండేలా చర్యలు తీసుకుంటామని పవన్ హామి ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారుల పిల్లలకు ఆదర్శ పాఠశాలలు నిర్మిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.