Pawan Kalyan About Nagababu Ministry: నాగబాబు తనతో పాటు సమానంగా పని చేశారని, వైఎస్సార్సీపీ నేతలతో తిట్లు తిన్నారు, పార్టీ కోసం నిలబడ్డారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో మీడియాతో పవన్ కల్యాణ్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కల్యాణ్ స్పందించారు.
ఇదే విషయం జగన్‌ను ఎందుకు అడగలేదు:ఇక్కడ కులం, బంధుప్రీతి కాదని, పనిమంతుడా కాదా? అనేది మాత్రమే చూస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎంపీగా ప్రకటించి, మళ్లీ నాగబాబును తప్పించామని గుర్తు చేశారు. మనోహర్, హరిప్రసాద్ మొదటినుంచి పార్టీ కోసం పని చేశారని, ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తామని అన్నారు. ఇదే విషయంలో జగన్‌ను మీరెందుకు అడగలేదని పవన్ ప్రశ్నించారు. కేవలం పవన్‌కల్యాణ్‌ను మాత్రమే అడుగుతారా అంటూ నిలదీశారు. తమకు బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా అన్నయ్య సొంతంగా ఎదిగారని, ఇప్పుడు తమ తర్వాత తరం పిల్లలకు ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉందని వ్యాఖ్యానించారు.
కులం కాదు పనితీరే ప్రామాణికం:నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారని, తరువాతే మంత్రి పదవిపై చర్చిస్తామని పవన్‌కల్యాణ్ వెల్లడించారు. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభ అనుకున్నామని, అది కుదరలేదు కాబట్టి ఎమ్మెల్సీ అనుకున్నామన్నారు. కందుల దుర్గేష్ ఏ కులమో తనకు తెలియదని, దుర్గేష్ పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చామని గుర్తు చేశారు. రాజకీయాల్లో కులం కాదని, పనితీరే ప్రామాణికమని తెలిపారు.
'గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు' - అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్
ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోదాము పెట్టిందెవరు?:మరోవైపు పేర్ని నాని గోదాము విషయంపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. రేషన్ బియ్యం మాయమైంది నిజమని, డబ్బులు కట్టింది వాస్తవమని అన్నారు. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోదాము పెట్టిందెవరని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను వాళ్లు తిట్టలేదా అని నిలదీశారు. తాము ఆడవాళ్లను కేసులో ఇరికించలేదని స్పష్టం చేశారు. పేర్ని నాని తప్పులే ఆయన ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాయన్నారు. అప్పుడు బూతులు తిట్టి, ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎలా అని మండిపడ్డారు.