ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఎక్సైజ్​ శాఖ ప్రక్షాళనకు కూటమి సర్కార్​ కసరత్తు - అధ్యయనంపై ప్రత్యేక కమిటీ నియామకం - AP Excise Department - AP EXCISE DEPARTMENT

AP Govt Focus on Exicise Department : ఎక్సైజ్‌ శాఖ పునరుద్ధరణకు నూతన ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. దీనిపై అధ్యయనం కోసం 17 మంది ఉద్యోగులతో అంతర్గత కమిటీని నియమించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను చీల్చి సెబ్‌ ఏర్పాటు చేయగా.. సరైన విధానాలు పాటించక రెండు విభాగాలు దెబ్బతిన్నాయనే వాదన ఉంది.

ap_govt_focus_on_exicise_department
ap_govt_focus_on_exicise_department (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 9:23 AM IST

AP Govt Focus on Exicise Department : ఎక్సైజ్‌ శాఖ పునర్‌వ్యవస్థీకరణకు కార్యాచరణ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం కోసం 17 మంది ఉద్యోగులతో అంతర్గత కమిటీ ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్, ఇన్‌స్పెక్టర్, స్టాఫ్‌ ఆఫీసర్‌ ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ యూనియన్ ప్రతినిధులకు కమిటీలో చోటు దక్కింది. అధ్యయన కమిటీ ఈ నెల 3వ తేదీలోగా పూర్తి నివేదిక అందజేయాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ నిషాంత్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన రహస్య ఎజెండాలో భాగంగా ఎక్సైజ్‌ శాఖను నిలువునా చీల్చేసింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) శాఖను ఏర్పాటు చేస్తూ 70 శాతం మంది సిబ్బందిని కేటాయించింది. ఎక్సైజ్‌ను నిర్వీర్యం చేసేలా తీసుకున్న ఈ నిర్ణయంతో సెబ్‌లో కూడా అవసరం మేరకు సిబ్బందిని పెట్టలేదు. ఎక్సైజ్‌ కమిషనర్, ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీ, డీజీపీ, సెబ్‌ కమిషనర్, జిల్లాల్లో సెబ్‌ అదనపు ఎస్పీల పర్యవేక్షణ, నియంత్రణ అధికమై రెండు వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి.

ఎక్సైజ్ శాఖ రెండుగా చీలడం వల్ల అనేక దుష్పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్​ శాఖలో లోపాలను చక్కదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు అధ్యయన కమిటీ ఏర్పాటు చేయగా నివేదిక అందిన వెంటనే రీస్ట్రక్చరింగ్‌ చేయనున్నారు. ప్రక్షాళన పూర్తయ్యాకే నూతన మద్యం పాలసీ ఖరారయ్యే అవకాశాలున్నాయి.

liquor seized: రూ.10 లక్షలు విలువైన తెలంగాణ మద్యం పట్టివేత

అధికారాలకు కత్తెర:గత ప్రభుత్వం స్టేషన్లతో పాటు ఎక్సైజ్‌ అధికారులకు ఉన్న అధికారాలన్నింటినీ తొలగించింది. అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా సెబ్‌కు పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వలేదు. కొన్ని చట్టాల కింద కేసులు నమోదు చేసే అధికారం సెబ్‌కు లేకుండా చేయడంతో పాటు క్రమంగా బడ్జెట్‌ కేటాయింపుల్లో కోతలు విధించారు. ఎక్సైజ్, సెబ్‌ మధ్య విభజన సహా అధికారాల్లో కోత వరకు రహస్య ఎజెండా ప్రకారం జరిగాయని ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా శాఖా పరంగా పదోన్నతులు, బదిలీలు సంబంధిత సర్వీసు సమస్యలు తలెత్తాయి.

గతంలో ఉన్న ఎక్సైజ్‌ స్టేషన్లు అన్నింటినీ తొలగించేయడంతో ఉద్యోగులంతా సెబ్‌ స్టేషన్‌కు వెళ్లి నమోదు చేయించుకోవాల్సిందే. ఇసుక అక్రమ రవాణా, జూదం తదితర అంశాలపై సెబ్‌ అధికారులకు కేసు నమోదు చేసే అధికారం లేకపోయింది. దీని వల్ల వారు ఇసుక దందా, పేకాట తదితర నేరాలకు పాల్పడే వ్యక్తుల్ని పట్టుకుంటే సివిల్‌ పోలీసుస్టేషన్‌లో అప్పగించాల్సి వస్తోంది. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, ఆ పైస్థాయి అధికారులను కేవలం వేతనాలు డ్రా చేయడం, ఇతరత్రా చిన్న చిన్న పనులకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పాటైన కమిటీ ఇప్పుడున్న వ్యవస్థలోని లోపాలతో పాటు కొత్త వ్యవస్థ ఎలా ఉండాలనేదానిపై నివేదిక ఇవ్వనుంది.

సెంట్రీ విధులకే పరిమితం:గతంలో ఉమ్మడి ఎక్సైజ్‌ స్టేషన్‌లో 12 నుంచి 13 మంది కానిస్టేబుళ్లు ఉండేవారు. కానీ విభజన అనంతరం సెబ్‌ స్టేషన్లలో ఇద్దరు, ముగ్గురు కానిస్టేబుళ్లే మిగిలారు. వారే ఎస్కార్ట్‌, సెంట్రీ విధులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో సిబ్బంది కొరత వల్ల ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు కూడా సెంట్రీ విధులు నిర్వహించాల్సి దుస్థితి వచ్చింది. ఎక్సైజ్‌ శాఖ పరిధిలో పనిచేసే ఒక్కో ఇన్‌స్పెక్టర్‌కు 50-60 మద్యం దుకాణాల పర్యవేక్షణ బాధ్యతలు, కొందరికైతే ఏకంగా జిల్లాలోని మొత్తం దుకాణాల పర్యవేక్షణ బాధ్యతలు ఇచ్చారు.

కృష్ణా జిల్లాలో భారీ మద్యం డంప్‌ స్వాధీనం- సోదాల్లో 58,080 మద్యం సీసాలు లభ్యం - LIQUOR DUMP IN Krishna district

విజయవాడలో డ్రగ్స్ కలకలం - సింథటిక్‌ డ్రగ్‌తో సెబ్​ అధికారులకు పట్టుబడ్డ యువకుడు

ABOUT THE AUTHOR

...view details