Nara Bhuvaneswari Nijam Gelavali Yatra:'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఫిరంగిపురం మండలం కండ్రికలో మృతుడు నల్లజర్ల చెన్నకేశవరావు, తాడికొండ మండలం బండారుపల్లిలో తూమాటి బాలయ్య కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించిన ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
మృతులకు నివాళులర్పించిన ఆమె ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయంగా చెక్కును అందజేశారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. అనంతరం కండ్రికలో వెలసిన షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం తుళ్లూరు మండలంలో ఆమె పర్యటన సాగింది.
బాపట్లలో భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర - పలు కుటుంబాలకు పరామర్శ
Nara Bhuvaneswari in Guntur District: ఈ క్రమంలో వెంకటపాలెం గ్రామంలో మహిళా పాడి రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరిపాల్గొన్నారు. రాజధాని కోసం 1500 రోజులుగా పోరాడుతున్న అమరావతి రైతులందరికీ పాదాభివందనాలు తెలిపారు. అమరావతి ఉద్యమంలో మహిళా శక్తి ఏంటో ఇక్కడి మహిళలు చాటారని కొనియాడారు. పోలీసుల దౌర్జన్యాలు, దాడులు, అక్రమ అరెస్టులు ఇలా ఎన్నో అవమానాలు అమరావతి మహిళలు భరించారన్నారు. కడుపుతో ఉన్న మహిళను బూటుకాలితో తన్ని పుట్టబోయే బిడ్డను కూడా పోలీసులు చంపేశారని మండిపడ్డారు. అమరావతి మహిళలు ఎవరూ నిరుత్సాహపడొద్దని ధైర్యం చెప్పారు.