AP Assembly Sessions 2024 Updates : విశాఖపట్నంలో పరిశ్రమల కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసెంబ్లీలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణయాదవ్ ప్రశ్న అడిగారు. దీనికి ఉపముఖ్యమంత్రి, పర్యావరణశాఖ మంత్రి పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. విశాఖలో ధూళి కణాల కాలుష్యం ఎక్కువగా ఉందని పవన్ తెలిపారు. అక్కడ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా త్వరలోనే పొల్యూషన్ ఆడిట్ చేయిస్తామని ఆయన చెప్పారు.
ఈ క్రమంలోనే పోర్టుల్లో కొన్ని ప్రైవేట్ బెర్తులు కాలుష్య కారకాలుగా మారుతున్నాయని ఎమ్మెల్యే వంశీకృష్ణయాదవ్ అన్నారు. మరోవైపు పొల్యూషన్ కారణంగా హిందూస్థాన్ గ్యాస్, ఎల్జీ పాలిమర్స్ వంటి పరిశ్రమలు మూతపడ్డాయని ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. కాలుష్య కారక పదార్థాలన్ని బహిరంగంగానే కన్పిస్తున్నాయని చెప్పారు. పొల్యూషన్ ఎంత మేర ఉందనే విషయం తెలసుకోవడానికి ఎక్విప్మెంట్ పెట్టాలని గణబాబు ప్రభుత్వాన్ని కోరారు.
Pawan Kalyan on Visakhapatnam Pollution :వీటిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలో 40 లక్షల మేర మొక్కలు నాటారని గుర్తుచేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలోకి ఎవరైనా వెళ్లి ఫిర్యాదులు చేసే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే సభ్యులు లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవాలేనని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. త్వరలో మంత్రి పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించాలని అయ్యన్న కోరారు. దీనిపై స్పందించిన పవన్ త్వరలోనే విశాఖలో పర్యటిస్తానని సమాధానమిచ్చారు. అక్కడ జల, వాయు, శబ్ద కాలుష్యం తగ్గించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కట్టుబడి ఉన్నాం: మరోవైపు ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయితే 2016 నుంచి 2024 వరకూ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద కొంతమందికి ఇస్తున్నారని చెప్పారు. కేంద్రం పీఎంయూఐ పథకం కింద మొదటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్, సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. తాము మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి తమ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఈ పథకంపై వివిధ శాఖలతో చర్చించి సభలో మరోసారి వివరాలు తెలియజేస్తానని నాదెండ్ల వెల్లడించారు