LIQUOR in CM Jagan meetings : వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఎవరైనా మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ, సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం ప్రజల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో కేసుల కొద్దీ మద్యం పొంగిపొర్లుతోంది. సాక్షాత్తూ సీఎం సభల నుంచే చట్ట ఉల్లంఘన మొదలవుతోంది. ఇప్పటివరకూ 'సిద్ధం' సభలు 4, 'మేమంతా సిద్ధం' సభలు 12 నిర్వహించగా ప్రతి సభకు వెయ్యి నుంచి 12 వందల ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలిస్తూ దారిలో మద్యం తీసుకొచ్చి లోడ్ చేశారు. ప్రతి బస్సులో సుమారు 100 క్వార్టర్ సీసాలు తాగించారు. అలా... ఇప్పటివరకూ జరిగిన సభల్లో దాదాపు 20 లక్షల మద్యం సీసాలు పంపిణీ చేశారు. మూడు సీసాలు ఉండటమే చట్టవిరుద్ధమైతే.. అన్ని లక్షల సీసాలు వైకాపా నాయకుల వద్దకు ఎలా చేరాయో ఎందుకు దర్యాప్తు చేయట్లేదు? ఎన్నికల సంఘానికి, అధికారులకు చిత్తశుద్ధి ఉంటే జగన్ సభలకు జనాల్ని తరలిస్తున్న ఏ బస్సులో చూసినా, ఏ సభ వద్దకు వెళ్లినా కేసుల కొద్దీ మద్యం పట్టుబడుతుంది. కానీ ఎందుకు దాడులు చేయట్లేదన్నదే అంతుచిక్కని ప్రశ్న.
వైఎస్సార్సీపీ నాయకులు రెండు మార్గాల్లో మద్యం సమకూర్చుకుంటున్నారు. వాసుదేవరెడ్డి ఇటీవలి వరకూ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా కొనసాగడంతో.. ప్రభుత్వ దుకాణాల్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున మద్యం సమకూర్చుకున్నారు. ఇప్పటికీ ఇది సాగుతోంది. గోవా, కర్ణాటక, తెలంగాణ నుంచి సుంకం చెల్లించని మద్యం తెప్పించుకున్నారు. సరిహద్దు చెక్‌పోస్టులను దాటించి మరీ ఇక్కడికి మద్యం తీసుకొస్తున్నారు. 2014 సమయంలోనే వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారుచేసి పంపిణీ చేశారని అప్పట్లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. కావలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి సహా పలువురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అధికారంలో లేనప్పుడే అంత పెద్ద ఎత్తున దందా చేసిన నాయకులు.. ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరింతగా పేట్రేగిపోతున్నారు.
మొన్న దర్శి, నిన్న చిత్తూరు, ఆలమూరు.. తాజాగా నగరి.. రాష్ట్రంలో ఎక్కడికక్కడే వైఎస్సార్సీపీ నాయకుల మద్యం నిల్వలు బయటపడుతున్నాయి. అడ్డదారుల్లోనైనా గెలవాలనే లక్ష్యంతో అధికారపార్టీ నాయకులు.. ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందే భారీగా మద్యం సమకూర్చుకున్నారు. వాటిని వారి స్థావరాల్లో నిల్వ చేసుకుని తెప్పించుకుంటున్నారు. పక్క రాష్ట్రాల నుంచి లారీల కొద్దీ మద్యం తెప్పించుకుని నిల్వ చేస్తూ ప్రస్తుతం నామినేషన్ల తరుణంలో బయటకు తెస్తుండటంతో ఈ డంప్‌ల ఉనికి బయటపడుతోంది. వాస్తవంగా వైఎస్సార్సీపీ నాయకుల గోదాములు, ఇతర స్థావరాల్లో ఉన్న మద్యం నిల్వలతో పాటు, వారు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నది పోలిస్తే పోలీసులకు పట్టుబడుతోంది ఒక శాతం కూడా లేకపోవడం గమనార్హం.
సీఎం జగన్‌కు జనం కరవు - వెలవెలబోతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర - CM jagan bus yatra
పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున లారీల్లో మద్యం తరలిస్తుంటే ఏ ఒక్కరూ వాటిని నిలువరించకపోవడానికి స్వామి భక్తే కారణమని తెలుస్తోంది. కోనసీమ జిల్లా ఆలమూరులో మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎన్నికల పరిశీలకుడు ప్రభాకర్‌రావుకు చెందిన ఇటుకల బట్టీలో 130 బాక్సుల్లో 6 వేల 240 గోవా మద్యం సీసాల డంప్ పట్టుబడింది. ఆ సరకు ఏపీకి రావాలంటే 3 రాష్ట్రాల సరిహద్దులు దాటాలి. ఎక్కడా చిక్కకుండా అంత మద్యం ఎలా తెచ్చారు? పుత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాల నుంచి మద్యం తరలిస్తూ వైసీపీ నేత పట్టుబడగా.. ఆ కళాశాలలో 250 కేసుల మద్యం నిల్వలు ఉన్నట్లు తేలింది. నగరిలో మంత్రి రోజా నామినేషన్ సందర్భంగా మద్యం పంపిణీ చేయడానికి తరలిస్తుండగా ఆ నాయకుడు చిక్కారు. ఇదంతా కర్ణాటక మద్యమే. ిదిలా ఉండగా చిత్తూరు డిప్యూటీ మేయర్ రాజేష్‌రెడ్డికి చెందిన కారు షెడ్డుపై దాడిచేయగా 170 కేసుల కర్ణాటక మద్యం పట్టుబడింది.