బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడి అక్రమ వెంచర్ - రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీలు (ETV Bharat) Inspection at Sreekari Ventures in Ongole : ఒంగోలులో వైఎస్సార్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడి వెంచర్‌లో రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. గత వైఎస్సార్సీపీ హయాంలో శ్రీకరి డెవలపర్స్ పేరిట ఒంగోలు - యరజర్ల రోడ్డులో బాలినేని వియ్యంకుడు నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన విల్లాల నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వెంచర్ నిర్మాణం కోసం యరజర్ల కొండల నుంచి అక్రమంగా పెద్ద ఎత్తున గ్రావెల్ తరలించారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
కొండల్లో క్వారీయింగ్ చేయకూడదన్న కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి వేలాది లారీలతో గ్రావెల్ తరలించారని తెలుస్తోంది. వెంచర్లలో విల్లాల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను కూడా అక్రమంగా రవాణా చేసారని ఫిర్యాదులు అందాయి. దీంతో పాటు వెంచర్ నిర్మాణం కోసం ప్రభుత్వం భూమి ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారడంతో వెంచర్‌లో అక్రమాలపై దర్యాప్తు చేయాలని వచ్చిన ఫిర్యాదుల మేరకు రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు.
మాజీ మంత్రి అండతో.. ప్రభుత్వ భూములు కొట్టేశారు: జనసేన కార్పొరేటర్
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట కొండలు చదును : శ్రీకరి అంపైర్ విల్లాస్‌కు మట్టి తరలింపుపై ఆది నుంచీ విమర్శలు వస్తున్నాయి. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని ధేనువకొండ నుంచి మట్టి తరలింపునకు అనుమతులు తీసుకుని ఒంగోలు సమీపంలోని యరజర్ల కొండలను తొలిచి లక్షలాది ట్రిప్పుల మట్టి తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. యరజర్ల సమీపంలో పేదలకు ఇళ్ల స్థలాల పేరిట కొండలను చదును చేశారు. ఇనుప ధాతువు కలిగిన ఈ మట్టిని అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని విల్లా ప్రాజెక్టును అక్రమంగా తరలించారు. అయినా అధికార యంత్రాంగం చోద్యం చూసింది. గతంలో ఐరన్ ఓర్ వెలికితీతకు జింపెక్స్ సంస్థకు కేటాయించిన స్థలం కోర్టు వివాదంలో ఉండటంతో పట్టాల పంపిణీ నిలిచిపోయింది. బాలినేని వియ్యంకుడి విల్లా ప్రాజెక్ట్‌కు మాత్రం మట్టి ఉపయోగపడింది.
నీటి కుంట కాదని ఈత కొలను :విల్లా ప్రాజెక్టులో పశువుల నీటికుంట, వాగు పోరంబోకు ఉన్నాయంటూ టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి, సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఇటీవల ఆరోపణలు చేశారు. పశువుల కుంట స్థానంలో ఈత కొలను నిర్మించారని, వాగు పోరంబోకు స్థలాన్ని పార్కింగ్ ప్రదేశంగా మలిచారని విమర్శలు చేశారు.
24 సెంట్ల పశువుల నీటికుంట ఉన్నమాట నిజమేననీ, దాన్ని తాము వదిలేశామని ఇటీవల ఒంగోలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా అంగీకరించారు. పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టి, చుట్టూ ప్రహారీ గోడ నిర్మించిన ప్రాంతంలోకి పశువులు వెళ్లి నీరు ఎలా తాగుతాయనే ప్రశ్నలకు సమాధానాలు లేవు.
మళ్లీ మేమే వస్తాం- లెక్కలన్నీ తేలుస్తాం! బాలినేని హెచ్చరికలు - YSRCP Leaders on ongole clash issue
వాల్టా చట్టానికి తూట్లు :ప్రాజెక్టు నిర్మాణంలో వాల్టా చట్టానికి నిలువునా తూట్లు పొడిచారనే ఆరోపణలూ ఉన్నాయి. వర్షాల సీజన్‌లో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటిని సముద్రానికి తీసుకెళ్లే నల్ల కాలువ ఒడ్డునే ఈ ప్రాజెక్టు ఉంది. వరద భారీగా ఉన్నప్పడు నల్లవాగు అత్యంత ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి వాగు ప్రాంతాన్ని కొంత మట్టితో చదును చేశారు. విల్లాస్ వెనుక వైపు భారీ ఎత్తున ప్రహారీ గోడ కట్టారు. వరదలు వస్తే నీరు వెనుక్కు తన్ని వెంగముక్కపాలెం వాసుల వ్యవసాయ భూములు నీట మునిగే ప్రమాదం ఉంది.
8 కి.మీ పొడవున పైపులైనువిల్లాలకు అవసరమైన నీటి కోసం ప్రాజెక్టు యాజమాన్యం భగీరథ ప్రయత్నమే చేసింది. యరజర్ల గ్రామానికి సమీపంలో ప్రైవేట్ భూమి కొనుగోలు చేసి అక్కడ బోర్లు వేశారు. అక్కడి నుంచి రోడ్డు వెంట ఏకంగా 8 కి.మీ దూరం పైపులైను నిర్మించారు. తమ గ్రామ సమీపంలో బోర్లు వేసి అక్రమంగా నీటిని తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని సమీప ప్రాంతాల వాసులు అప్పట్లో గగ్గోలు పెట్టారు. అయినా అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోయారు.
సమ్మర్ స్టోరేజి ట్యాంకు నీటిని నిబంధనలకు వ్యతిరేకంగా విల్లాల నిర్మాణాలకు వినియోగిస్తున్నా అదేమని అడిగిన నాథుడే లేరు. ప్రాజెక్టు నిర్మాణాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే సీఐడీ దృష్టి సారించింది. విచారణ ప్రక్రియ ముందుకు సాగకుండా అడ్డుకున్నారనే విమర్శలు ఉన్నాయి. విల్లా ప్రాజెక్ట్‌లో భారీగా ఇసుకను అక్రమంగా డంప్ చేశారనే ఫిర్యాదు మేరకు తాజాగా రెవెన్యూ, గనుల శాఖ, సెబ్, పోలీసు అధికారులతో కూడిన ఉమ్మడి బృందం తాజాగా ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. భారీ ఎత్తున ఇసుక నిల్వ చేసినట్లు గుర్తించి బిల్లుల కోసం ఆరా తీసింది.
రూ.60 వేలు విలువ చేసే భూమిని 6 లక్షలుగా చెప్పుకుంటున్నారు- బాలినేనిపై దామచర్ల ఫైర్