Idi Manchi Prabhutvam Program in East Godavari District:గడిచిన ఐదేళ్లలో మంచి పరిపాలన పొందలేకపోయామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పరిపాలన సక్రమంగా చేయకపోవడం వల్లే 175 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసి ఇంటికి సాగనంపారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం డీ.ముప్పవరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదిక కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో జాతీయ పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్ నిర్వహించిన సామూహిక సీమంతపు వేడుకల్లో పాల్గొని గర్భిణులను ఆశీర్వదించారు. ప్రజా వేదికలో పాల్గొని స్వర్ణాంధ్ర సాధన గోడ పత్రికను మంత్రి ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరికీ అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రాష్ట్రాన్ని ప్రజలను అభివృద్ధి పథంలో పయనించేలా చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడంతో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి దుర్గేష్ వివరించారు.
నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో ఏదైనా మాట్లాడలన్నా అడగాలన్నా భయమేసిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రజలను పలకరించిన ప్రజాప్రతినిధులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకుంటూ పనిచేస్తుందని చెప్పారు. పేద బడుగు వర్గాలకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని శేషారావు స్పష్టం చేశారు.
వంటింట్లో మంటలు - నూనె ధరల పెంపుతో సామాన్యులపై భారం వేసిన కేంద్రం - Increased cooking oil prices