Minister Anitha Fires on Jagan : వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారని రూ.11కు పందేలు నడుస్తున్నాయని హోం మంత్రి అనిత వ్యంగ్యాాస్త్రాలు సంధించారు. రఘురామ స్పీకర్ స్థానంలో కూర్చుంటే ఆయన శాసనసభకి రారని కూడా బెట్టింగ్‌లు నడుస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ జగన్ తాడేపల్లి నివాసంలో మాక్ అసెంబ్లీ నిర్వహించాలన్నా కోరం కూడా లేదని తెలిసిందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్‌కి సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు.
కొన్ని పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయి :మహిళలను ఏదైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరని అనిత చెప్పారు. సొంత తల్లిని, చెల్లిని తిట్టినవారిని మీరేం చేయలేకపోయారని జగన్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. వారిని తాము అరెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి వారికి తమరు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. కొన్ని పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయని అనిత పేర్కొన్నారు.
"జడ్జిలు, వారి కుటుంబసభ్యులను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. వాళ్లు పెట్టిన పోస్టులపై కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఇలాంటి పోస్టులు పెట్టినవారిని ఏం చేయాలో ప్రజలే చెప్పాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అనేకమంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. మీరు ఎక్కడికి వెళ్లినా మేం అడ్డుకోవడం లేదు. వీరిని ఇలాగే వదిలేస్తే రేపు మీ ఇంట్లోని ఆడపిల్లలపైనా పోస్టులు పెడతారు." - అనిత, హోం మంత్రి
మరోవైపు సోషల్ మీడియా పోస్టులపై వైఎస్సార్సీపీ నేతలు మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించడం విడ్డూరమని అనిత మండిపడ్డారు. సభ్య సమాజంలో వర్రా రవీందర్‌రెడ్డి, బోరుగడ్డ అనిల్, ఇంటూరి రవి లాంటి వాళ్లు తిరగడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ఎంతవరకు అవసరమో ప్రజలే ఆలోచించాలని పేర్కొన్నారు. ప్రజాధనంతో నడిచే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అసభ్య పోస్టులు పెట్టించిన సజ్జల భార్గవ్‌రెడ్డి, అవినాష్ రెడ్డిని కాపాడాలని ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారా అని అనిత ప్రశ్నించారు.