Home Minister Anitha Reacted on Eluru Call Money Incident:ఏలూరు కాల్ మనీ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కిస్తీలకు ముందే వడ్డీకోత, సమయం దాటితే డబుల్ కిస్తీ పేరుతో చేసే కాల్‌మనీ వ్యవహారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూవారీ వడ్డీ పేరుతో సామాన్య ప్రజలను జలగల్లా పీల్పి పిప్పి చేసే వారిని సహించబోమని హెచ్చరించారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్ల పేరుతో అమాయకులను బలిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. వసూళ్ల పేరుతో మహిళలను బెదిరించి, వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఏలూరు ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి కాల్‌మనీ వ్యవహారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారే టార్గెట్ జరిగే వడ్డీ వ్యాపారాలను సీరియస్‌గా తీసుకుంటామని అనిత హెచ్చరించారు.
ఇదీ జరిగింది: వైఎస్సార్సీపీ నేత కాల్ మనీ దందాకు బలయ్యామని ఇటీవల ఏలూరులో కొంతమంది బాధితులు ఆరోపించారు. అప్పు ఇచ్చి దానికి ఇష్టమొచ్చినట్లు వడ్డీలు కట్టించుకునే వారని సమయానికి కట్టకపోతే ఇష్టానుసారంగా వ్యవహరించే వారని వాపోయారు. భయపడి కట్టినా ఇంకా బకాయి ఉన్నారంటూ వేధించేవారని తెలిపారు. అప్పు ఇచ్చిన సమయంలో తీసుకున్న ప్రామిసరీ నోట్లతో ఇప్పుడు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏలూరు ఎస్పీతో మంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.