Freehold Land Scam By YSRCP Leaders in Sri Sathya Sai District :వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన ఫ్రీహోల్డ్ చట్టాన్ని ఆసరాగా తీసుకుని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశారు. ఎసైన్ చేయని ప్రభుత్వ భూముల్ని చేసినట్లుగా చూపించి సొంతం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఫ్రీహోల్డ్ భూములపై చేపట్టిన విచారణలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
శ్రీసత్యసాయి జిల్లాలో ఏకంగా 1.26 లక్షల ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితా(22ఏ) నుంచి తొలగించారు. ఫ్రీహోల్డ్ చేసిన మొత్తం భూమిలో సగానికిపైగా అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలింది. దొంగ పట్టాలు సృష్టించి రికార్డులు తారుమారు చేసి విలువైన ప్రభుత్వ భూముల్ని వైఎస్సార్సీపీ నాయకులు కాజేశారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలింది.
నకిలీ డి-పట్టాలు సృష్టించి : 2003కు ముందు ఎసైన్ చేసిన భూములన్నింటికీ యాజమాన్య హక్కులు కల్పించాలని గత ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీన్ని ఆసరాగా తీసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన సర్వే నంబర్లను గతంలోనే ఎసైన్ చేసినట్లుగా నకిలీ డి-పట్టాలు సృష్టించారు. విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి 2003కు ముందు తేదీలతో సంతకాలు చేయించుకున్నారు.
తర్వాత వాటిని ఆధారాలుగా చూపి ఫ్రీహోల్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన రెవెన్యూ అధికారులు కళ్లు మూసుకుని వాటికి యాజమాన్య హక్కులు కల్పించారు. ఇలా శ్రీసత్యసాయి జిల్లాలో ఏకంగా 89,331 ఎకరాల ప్రభుత్వ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించడం గమనార్హం. ముదిగుబ్బ, పుట్టపర్తి మండలాల్లో గతంలోనే రికార్డులు కాలిపోవడాన్ని అవకాశంగా తీసుకుని పెద్ద మొత్తంలో నకిలీ పట్టాలు సృష్టించినట్లు తెలుస్తోంది.